Hyderabad District: 150 సార్లు వెబ్‌సిరీస్ చూసి దొంగనోట్ల ముద్రణ..నిందితుల అరెస్ట్

  • హైదరాబాద్‌లోని బాలానగర్‌లో శనివారం ఘటన
  • ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దొంగనోట్ల ముద్రణవైపు మళ్లిన ప్రధాన నిందితుడు
  • 150 సార్లు వెబ్‌సిరీస్ చూసి పక్కా ప్లాన్‌తో నోట్ల ముద్రణ ప్రారంభించిన వైనం
  • బాలానగర్ ఎస్ఓటీ, అల్లాపూర్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు
Hyderabad police arrest individual with fake currency balanagar

హైదరాబాద్‌లో దొంగనోట్లు చలామణీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను బాలానగర్ ఎస్ఓటీ, అల్లాపూర్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు 150 సార్లు వెబ్‌సిరీస్ చూసి దొంగనోట్లు ముద్రించడం ప్రారంభించినట్టు గుర్తించారు. అల్లాపూర్ సీఐ శ్రీపతి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లాకు చెందిన వనం లక్ష్మీనారాయణ (37) కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. బోడుప్పల్‌లోని మారుతీనగర్‌లో ఉంటూ స్తిరాస్థి వ్యాపారం చేస్తున్నాడు. ఇతడిపై గతంలో కొన్ని పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన మరో ప్రైవేటు ఉద్యోగి ఎరుకల ప్రణయ్‌కుమార్ ఇతడికి మిత్రుడు.

ఇటీవల ఆర్థిక పరిస్థితి దిగజారడంతో లక్ష్మీనారాయణ దొంగనోట్ల చలామణీకి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి దొంగనోట్ల ముద్రణకు సంబంధించి ఓ బాలీవుడ్ వెబ్‌సిరీస్‌ గురించి తెలుసుకున్నాడు. ఓటీటీలో ఈ సిరీస్‌ను రెండు నెలల్లో 150 సార్లు వీక్షించి దొంగనోట్ల ముద్రణకు కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకున్నాడు. ప్రణయ్ కుమార్‌తో 1:3 నిష్పత్తిలో ఒప్పందం కుదుర్చుకున్నాక తొలి విడతగా రూ.3 లక్షల విలువైన దొంగనోట్లు ముద్రించి జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో అతడితో చలామణీ చేయించాడు. తొలి ప్రయత్నం సఫలం కావడంతో మరో మారు దొంగనోట్ల చలామణీకి రెడీ అయ్యారు. 

ఈ క్రమంలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పదంగా ఉన్న లక్ష్మీనారాయణ, ప్రణయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 810 రూ.500ల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేయగా ప్రింటర్, ల్యాప్‌టాప్, ఇతర ముద్రణ సామగ్రి కూడా లభించాయి. దొంగనోట్లు ముద్రిస్తున్న గదిలోకి లక్ష్మీనారాయణ తన కుటుంబసభ్యులను కూడా రానీయకుండా తాళం పెట్టేవాడని పోలీసులు తెలిపారు.

More Telugu News