Bandi Sanjay: ఉగ్రవాదులకు, కాంగ్రెస్ వారికి తేడా లేదు.. దేశద్రోహం కేసు పెట్టాలి: బండి సంజయ్

  • దక్షిణ, ఉత్తర దేశాలుగా విభజించాలన్న కాంగ్రెస్ ఎంపీపై బండి సంజయ్ ఆగ్రహం
  • అయోధ్య రామాలయాన్ని నిర్మించింది మేమే.. ఏం చేసుకుంటారో చేసుకోండన్న బండి సంజయ్
  • అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై హర్షం
Bandi Sanjay demands for case against Congress MP

కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని తీవ్రవాదులు, ఖలిస్థాన్ దేశం కావాలని ఉగ్రవాదులు చెబుతున్నారని... ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ సురేశ్ దేశాన్ని దక్షిణ దేశంగా, ఉత్తర దేశంగా విభజించాలని దారుణమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశాన్ని విభజించాలంటూ ఎంపీ డీకే సురేశ్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీపై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతోందనే ఆందోళనలో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

టెర్రరిస్టులకు, తీవ్రవాదులకు, కాంగ్రెస్ నాయకులకు తేడా లేకుండా పోయిందన్నారు. గతంలో రాహుల్ గాంధీ సైతం భారతీయుడిగా చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నానని దేశాన్ని కించపర్చారన్నారు. ఆయన బావ రాబర్ట్ వాద్రా సైతం భారత్‌ దుర్భల దేశమని భారతీయులను కించపర్చారన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. భారత్‌ను ముక్కలు చేయాలని కోరడం ముమ్మాటికీ దేశ ద్రోహమేనని, ప్రజలంతా వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

అయోధ్య రామాలయాన్ని నిర్మించింది మేమే

బీజేపీ మత రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది తామేనని... ఏం చేసుకుంటారో చేసుకోండని వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిరం స్థానంలో బాబ్రీమసీదును నిర్మిస్తామని చెప్పే దమ్ము కాంగ్రెస్‌ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. 

అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై హర్షం

అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎమర్జెన్సీ, అయోధ్య పోరాటంలో పాల్గొన్న అద్వానీకి భారతరత్న ఇవ్వడం సంతోషకరమన్నారు. ప్రతి సర్వేలోనూ బీజేపీ గెలుస్తుందని, మోదీ తిరిగి ప్రధాని అవుతారని ఫలితాలు వస్తున్నాయని గుర్తు చేశారు. ఈ నివేదికలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోందన్నారు. అవార్డులను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆరోపించారు.

More Telugu News