Kumari Aunty: రేవంత్ రెడ్డికి చెప్పి మాకు ఉద్యోగం ఇప్పించండి: 'కుమారి ఆంటీ'కి మొరపెట్టుకున్న నిరుద్యోగులు

  • తమ సమస్యను రేవంత్ రెడ్డికి చెప్పాలని కుమారి ఆంటీకి విజ్ఞప్తి
  • తనకు ఇవేవీ తెలియవన్న కుమారి ఆంటీ
  • దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి
  • రేవంత్ రెడ్డి మీ వద్దకు వచ్చినప్పుడు ఓ దరఖాస్తు ఇవ్వాలంటూ నిరుద్యోగుల విజ్ఞప్తి
  • ఈ ఘటనతో ఇప్పటికే మీ సమస్య విని ఉంటారన్న కుమారి ఆంటీ
Unemployees asked Kumari Aunty for jobs

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని... మీరు చెప్పి ఇప్పించాలని, లేదంటే మీ వద్ద ప్లేట్లు కడిగే ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ కొంతమంది నిరుద్యోగులు... కుమారి ఆంటీకి మొరపెట్టుకున్నారు. హైదరాబాదు మాదాపూర్ లో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను ఇటీవల ట్రాఫిక్ పోలీసులు మూసివేయించడం.. ఆ వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళడంతో ఆయన ఆమెకు అండగా నిలుస్తూ.. ఆమె ఫుడ్ స్టాల్ ను నిర్వహించుకునేలా ఆదేశాలు ఇవ్వడం విదితమే. దీంతో ఆమె మరింత పాప్యులర్ అయ్యారు. 

ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ వద్దకు ఈ రోజు పలువురు నిరుద్యోగులు వచ్చి, తమ గురించి ముఖ్యమంత్రికి చెప్పమంటూ ఆమెను ఇబ్బంది పెట్టారు. అయితే తనకు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు తెలియవని... తాను రోడ్డు పక్కన ఫుడ్డు అమ్ముకునే వ్యక్తిని అని.. తన సమస్యపై ముఖ్యమంత్రి స్పందించారని గుర్తు చేశారు. ఆయన ప్రజానాయకుడని, అందరి సమస్యలను పరిష్కరిస్తారని వారికి ధైర్యం చెప్పారు. తమకు ప్రభుత్వం అన్యాయం చేసినందునే మీ వద్దకు వచ్చామని నిరుద్యోగులు పదేపదే ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆమె 'నాన్నా... నాన్నా నేను చెప్పేది వినండి' అంటూ ఆమె ఓపికగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.

 ఆయన అందరి సమస్యలు తీరుస్తారన్న కుమారి 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనం ఏదో చెప్పాల్సిన అవసరం లేదని... ఆయనను నేను అడిగితేనే స్పందించారా? ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడు కాబట్టి రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే... ఓ చిరు వ్యాపారిని అయిన తన సమస్యపై స్పందించారని కుమారి ఆంటీ అన్నారు. తనలాంటి వ్యక్తికి మద్దతుగా నిలిచినందుకు ముఖ్యమంత్రికి మనం జేజేలు కొట్టాలన్నారు. ఏ ఒక్కరిపైనో కాదని... మనందరి మీద జాలి చూపించే వ్యక్తి ఆయన అని అన్నారు. 

దానికి ఓ నిరుద్యోగి స్పందిస్తూ... అక్కా ఇన్ని చెబుతున్నారు, విద్యార్థుల సమస్య గురించి ఓసారి ముఖ్యమంత్రికి చెప్పండని కోరారు. ఆయన అందరి సమస్యలు తీరుస్తారని కుమారి ఆంటీ అనగా... మా సమస్యలు తీర్చడం లేదు కదా అని సదరు నిరుద్యోగి అన్నారు.

రేవంత్ రెడ్డి వచ్చి ఎన్ని రోజులు అవుతోంది? ఆయన ప్రజానాయకుడనే విషయం మనం అర్థం చేసుకోవాలన్నారు.

అక్కా మీ వద్ద ప్లేట్లు కడిగే ఉద్యోగం ఇప్పించండి

అక్కా మాకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందనే నమ్మకం లేదని, మీ వద్ద ప్లేట్లు కడుగుతాం.. మాకు ఉద్యోగాలు ఇవ్వు అక్కా అని అతను విజ్ఞప్తి చేశాడు. ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని... కనీసం మీ వద్ద ప్లేట్లు కడిగేందుకు అవకాశమివ్వాలని కోరాడు.

తమతో ఓటు వేయించుకొని ఇప్పుడు తమ కోసం పని చేయడం లేదని నిరుద్యోగులు ఆరోపించారు. అలాంటి వ్యక్తి ప్రజా నాయకుడు ఎలా అవుతాడు? అని ప్రశ్నించారు.

ప్లీజ్.. నన్ను వదిలేయాలన్న కుమారి ఆంటీ

ఇలాంటి పెద్ద పెద్ద అంశాలు తనకు తెలియదని... తాను కేవలం రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముకునే వ్యక్తినని.. తనను ఇబ్బంది పెట్టవద్దని.. ప్లీజ్.. తనను వదిలేయండని ఆమె పదేపదే విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్‌కు సీఎం పదవి ఇస్తారా? అని ప్రశ్నించిన నిరుద్యోగులు

జీవో నెంబర్ 46 కోసం నిరుద్యోగులం ఎనిమిది నెలలుగా పోరాడుతున్నామని, కాబట్టి వీరి బాధను కూడా పట్టించుకోవాలని అక్క(కుమారి ఆంటీ) ద్వారా ముఖ్యమంత్రికి చెప్పించేందుకు తాము వచ్చామని నిరుద్యోగులు తెలిపారు. 64 సీట్లు వచ్చిన మీరు... ఎలాగైతే ముఖ్యమంత్రి అయ్యారో... అలాగే 125 మార్కులు వచ్చిన తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే 60 లేదా 64 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తామంటే... 38 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అని నిలదీశారు.

రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇది ఒక్కటి ఇవ్వండి

నిరుద్యోగులు ఓ దరఖాస్తును కుమారి ఆంటీ చేతికి ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి మీ వద్దకు వచ్చినప్పుడు ఈ దరఖాస్తు ఇస్తే చాలని వారు విజ్ఞప్తి చేశారు.

"మీ అందరికీ దయచేసి ఒకే మాట చెబుతున్నాను... "

"మీ అందరికీ దయచేసి ఒకే మాట చెబుతున్నాను... ఈ విషయాలు ఏమీ నాకు తెలియదు. నాకు చదువు లేదు. ఇంట్లో ఏదో వంట చేసి నలుగురికి అన్నం పెట్టి బతికే ఓ పేదవ్యక్తిని. కాబట్టి దయచేసి నా మాట వినండి.. ఇవన్నీ నాకు తెలియదు... నానా... ఆయన (సీఎం రేవంత్ రెడ్డి) నాలాంటి చిరు వ్యాపారి పైనే స్పందించారంటే మీ సమస్యలు కూడా తీరుస్తారు. మీ దరఖాస్తును నేను తీసుకోవాల్సిన అవసరం లేదు... ఎందుకంటే మీ సమస్యను ముఖ్యమంత్రి విని ఉంటారు. ఇప్పుడు నా బిజినెస్ ఆగిపోయింది" అన్నారు.

సమస్యలు తీర్చేవారే ప్రజా నాయకులు అవుతారన్నారు. మీ సమస్యలపై తనకు ఏమీ తెలియదని.. అలాంటప్పుడు ఎలా మాట్లాడుతానో అర్థం చేసుకోవాలన్నారు. ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను తనవే కాకుండా అందరి సమస్యలను కూడా సమస్యలుగానే పరిగణిస్తానని అన్నారు. దయచేసి నా మాటలను ఎవరూ అపార్థం చేసుకోవద్దు... కానీ నాకు ఏమీ తెలియదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని కోరారు. తనకు బయటి ప్రపంచం ఏమీ తెలియదని.. కాబట్టి తనను వదిలేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అందరి సమస్యలను పరిష్కరిస్తారని... ఆయనను ఎవరూ అపార్థం చేసుకోవద్దని కోరారు.

More Telugu News