Jaspreet Bumrah: ఇంగ్లండ్ ను హడలెత్తించిన బుమ్రా... టీమిండియాకు కీలక ఆధిక్యం

  • విశాఖలో టీమిండియా-ఇంగ్లండ్ రెండో టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 253 ఆలౌట్
  • బుమ్రాకు 6 వికెట్లు... కుల్దీప్ యాదవ్ కు 3 వికెట్లు
  • టీమిండియాకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
  • ముగిసిన రెండో రోజు ఆట
Team India bundled England for 253 runs in 1st innings and get crucial lead

విశాఖ టెస్టులో భారత్ మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది. ఇవాళ ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్ లో 253 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా... 143 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది. జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. 

అనంతరం, నేడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా... రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 15, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 171 పరుగులకు పెరిగింది. 

అంతకుముందు, టీమిండియా బౌలర్లు విశాఖ పిచ్ పై విశేష ప్రతిభ కనబరిచ్చారు. ముఖ్యంగా, బుమ్రా ధాటికి ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. జో రూట్ (5), ఓల్లీ పోప్ (23), బెయిర్ స్టో (25), కెప్టెన్ బెన్ స్టోక్స్ (47), టామ్ హార్ట్ లే (21), జేమ్స్ ఆండర్సన్ (6) ల వికెట్లు బుమ్రా ఖాతాలోకి చేరాయి. ముఖ్యంగా, తొలి టెస్టు సెంచరీ హీరో ఓల్లీ పోప్ ను బుమ్రా అవుట్ చేసిన యార్కర్ అద్భుతం. ఆ బంతి ఓల్లీ పోప్ మిడిల్, లెగ్ స్టంప్ లను గిరాటేసింది. 

ఇక, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా 3 వికెట్లతో సత్తా చాటాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనంలో తన వంతు పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్ కు 1 వికెట్ దక్కింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. యువకెరటం యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీ చేయడం రెండో రోజు తొలి సెషన్ లో హైలైట్ గా నిలిచింది.

More Telugu News