YS Jagan: రామాయణం, మహాభారతంలోని విలన్లు అందరూ ఇక్కడే ఉన్నారు: దెందులూరు 'సిద్ధం' సభలో సీఎం జగన్

  • దెందులూరులో వైసీపీ సిద్ధం సభ
  • విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై జగన్ ధ్వజం
  • జగన్ ఒంటరి కాదని స్పష్టీకరణ
  • కోట్లాది ప్రజల హృదయాల్లో జగన్ ఉన్నాడని వెల్లడి
CM Jagan take a jibe at opposition

దెందులూరులో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు.... 25కి 25 ఎంపీ స్థానాలే మన టార్గెట్ అని స్పష్టం చేశారు. మరో  చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్ ను కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా? అంటూ ఉత్సాహం రగిల్చే ప్రయత్నం చేశారు. 

రామాయణం, మహాభారతంలోని విలన్లు అందరూ ఇక్కడే ఉన్నారని విపక్ష నేతలు, కొన్ని మీడియా సంస్థలపై సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో విలన్లందరూ ఇక్కడే ఉన్నారని విమర్శించారు. చూడ్డానికి ఇంతమంది తోడేళ్ల మధ్య తాను ఒంటరిగానే కనిపిస్తానని వ్యాఖ్యానించారు. కానీ నిజం ఏంటంటే... కోట్ల మంది హృదయాల్లో తాను ఉన్నానని స్పష్టం చేశారు. 

జగన్  ఏనాడూ ఒంటరి కాదు... వారికున్న సైన్యం ఎల్లోమీడియా, పొత్తులు అయితే... నాకున్న సైన్యం, నా బలం, నా దేవుడు... సర్వం ప్రజలే అని సీఎం జగన్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల రణ క్షేత్రంలో మీరు (ప్రజలు) కృష్ణుడి పాత్ర పోషిస్తే... నేను అర్జునుడ్ని అవుతా అంటూ పునరుద్ఘాటించారు. 

"మనం చేస్తున్న మంచి, సంక్షేమంపై విపక్షాలు దాడి చేస్తున్నాయి. మనం 99 శాతం హామీలు నెరవేర్చాం. లంచాలు, వివక్షకు చోటివ్వకుండా ప్రతి ఇంటికీ సంక్షేమం అందించాం" అంటూ  సీఎం జగన్ వివరించారు.

More Telugu News