Mallu Bhatti Vikramarka: ధరణి ద్వారా కోల్పోయిన భూములను గోండులకు అప్పగిస్తాం: మల్లు భట్టి విక్రమార్క

  • గిరిజనులకు నీటి వనరులు అందుబాటులోకి తెస్తామన్న మల్లు భట్టి
  • రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తుందని వ్యాఖ్య
  • గత ప్రభుత్వ పెద్దలు తెలంగాణలోని వనరులను దోపిడీ చేశారని ఆరోపణ
Mallu Bhatti Vikramarka promises to give lands to gondu people

ధరణి ద్వారా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు ఆ భూమిని తిరిగి అప్పగిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులను పేద గోండు ప్రజలకు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ల పాటు కొద్దిమంది చేతుల్లో బందీ అయిందన్నారు. ఈ పదేళ్లపాటు ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు లేకుండా పోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని వనరులను దోపిడీ చేశారని ఆరోపించారు. తెలంగాణ దోపిడీకు గురవుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించిందన్నారు. అందుకే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... ఇదే ఇంద్రవల్లి నుంచి మీ కష్టాలు తీరుస్తామని శంఖారావం పూరించామన్నారు. ఇక్కడి నుంచి ప్రారంభమైన పోరాట యాత్ర... అంతిమంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావడానికి దోహదపడిందన్నారు.

ప్రజాప్రభుత్వం ఏర్పడటంతో ఇచ్చిన మాట మరిచిపోకుండా... ఇంద్రవెల్లి వద్దకు వచ్చి ఇక్కడి నాగోబా దేవాలయం నుంచి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఆదివాసీల అమరుల స్థూపం వద్ద ఏ హామీ ఇచ్చామో... ఆ మాటను నిలబెట్టుకోవడానికి అదే స్థూపం వద్దకు వచ్చి మాట ఇచ్చి వెళ్తున్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు గద్దరన్న పేరు పెట్టాలని తాము నిర్ణయించామన్నారు. స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహకారం అందిస్తామన్నారు.

More Telugu News