Dr Suneetha: షర్మిలను, నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు: డాక్టర్ సునీత

  • ట్రోలింగ్ పై పోలీసులను ఆశ్రయించిన వివేకా కుమార్తె
  • జుగుప్స కలిగేలా రాస్తున్నారని ఆవేదన
  • పులివెందుల ఎమ్మెల్యేకు బాధ్యత లేదా? అంటూ ఆగ్రహం
Dr Suneetha talks to media against trolling

ఇటీవల ఇడుపులపాయలో వైఎస్ షర్మిలను వివేకా కుమార్తె డాక్టర్ సునీత కలవడం తెలిసిందే. అయితే, షర్మిలను తాను కలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారని సునీత వెల్లడించారు. 

షర్మిలపైనా, తనపైనా ఆ పోస్టుల్లో నీచంగా రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరీ అంత ఘోరంగా ఎలా రాస్తారో అర్థం కావడంలేదని, అంత అసభ్యకరమైన భాషను తాను ఎప్పుడూ చూడలేదని వాపోయారు. ఆ రాతలు ఎవరికీ చెప్పుకోలేని విధంగా, ఎంతో జుగుప్స కలిగించేలా ఉన్నాయని సునీత పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా ట్రోల్స్ ను గమనిస్తుంటే, ఆ ట్రోలింగ్ ఇప్పుడే కాదని, చాలాకాలంగా జరుగుతోందన్న విషయం అర్థమైందని వివరించారు. 

తనను చంపెయ్యాలా అనే విధంగా కొన్ని పోస్టులు ఉన్నాయని, ఇక వీటిని ఉపేక్షించరాదన్న ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఇలాంటి తప్పులు జరుగుతుంటే, ఆ తప్పులను ఖండించడం కూడా చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. పెద్దాయన అంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై కొడుకు కూడా స్పందించాలి కదా... ఆ కొడుకు ఒక లీడర్ కూడా కదా అని సునీత వ్యాఖ్యారించారు. లీడర్ గా తనకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. నాకు, షర్మిలకే ఇలా జరుగుతుంటే, ఏపీలో మిగతావాళ్ల పరిస్థితి ఏంటి? అని ఆక్రోశించారు. 

"ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి పేరుతో కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు తాను చేయలేదని, తన పేరుతో నకిలీ అకౌంట్ సృష్టించి ఈ పోస్టులు పెట్టారంటూ అతడే పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశాడట. పులివెందులలో ఎమ్మెల్యే ఎవరండీ... ఆయనకు బాధ్యత ఉండదా? ఇంట్లో ఆడవాళ్లకే రక్షణ ఇవ్వలేకపోతే, ప్రజలకు ఏం రక్షణ ఇస్తారు?" అంటూ సునీత ధ్వజమెత్తారు.

More Telugu News