YS Sharmila: ప్రత్యేక హోదాపై చంద్రబాబు, జగన్ ప్రసంగాలను మీడియాకు వినిపించిన షర్మిల

  • ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో షర్మిల ధర్నా
  • చంద్రబాబు, జగన్ పై తీవ్ర విమర్శలు
  • రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని బానిసలుగా మారారని వ్యాఖ్యలు
  • మోదీని నిలదీసే దమ్ములేదంటూ తీవ్ర వ్యాఖ్యలు
Sharmila take a jibe on Chandrababu and Jagan over special status issue

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నేడు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదాపై నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు, విపక్షనేతగా ఉన్న జగన్ ఏమని అన్నారో, వారి ప్రసంగాల తాలూకు క్లిప్పింగ్స్ ను అందరికీ వినిపించారు. హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇవ్వాలని చంద్రబాబు పేర్కొనగా, 25కి 25 ఎంపీలను గెలిపిస్తే హోదా ఎలా ఇవ్వరో చూస్తామని జగన్ ఆవేశంగా ప్రసంగించడం ఆ క్లిప్పింగ్స్ లో ఉంది. 

అనంతరం షర్మిల తన ప్రసంగం కొనసాగించారు. "రాష్ట్ర విభజన తర్వాత మొదట ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అయినా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న అయినా... ప్రత్యేకహోదాపై మీరిచ్చిన మాట తప్పితే ఏపీ ప్రజలకు ద్రోహం చేసినట్టా, కాదా? దీనికి మీరిద్దరూ సమాధానం చెప్పాలి. 

ఇవాళ బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా చూస్తోంది. ఏపీ ప్రజలను కనీసం మనుషుల్లా కాకుండా, పురుగుల్లా చూస్తున్నప్పటికీ రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మోదీకి బానిసగా మార్చేశారు. బీజేపీ మనకు ఏమైనా మేలు చేసి ఉంటే, మీరు ఆ పార్టీకి గులాంగిరీ చేసినా ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు. 

మనకు పోలవరం అవసరంలేదా? రాజధాని అవసరంలేదా? పోలవరం ఇవ్వకపోయినా, రాజధాని ఇవ్వకపోయినా మీరెందుకు బానిసలుగా ఉంటున్నారు? ప్రత్యేక హోదా అనేది సంజీవని వంటిదని ఈ నాయకులే చెప్పారు. ప్రత్యేకహోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు, పెద్ద పెద్ద దీక్షలు చేశారు, ఒక్కొక్కరు పెద్ద పెద్ద మీటింగులు పెట్టారు. 

ప్రత్యేక హోదా వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో ఈ నాయకులకు తెలియక కాదు. వీళ్లకు బాగా తెలుసు. ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖండ్ లో 2 వేల పరిశ్రమలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో 10 వేల పరిశ్రమలు వచ్చాయి. పరిశ్రమలు రావడం వల్ల మౌలిక వసతుల కల్పన పెరుగుతుంది, మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 

కానీ ఇవాళ ఎంపీలందరూ ప్రత్యేక హోదా ఊసే లేకుండా ప్రతి అంశంలోనూ బీజేపీకే ఎందుకు మద్దతు ఇస్తున్నారో, మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో, ఎందుకు బీజేపీకి ఇంతగా అమ్ముడుపోయారో, బీజేపీకి ఎందుకింత బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి. 

చంద్రబాబుకు ఐదేళ్లు అధికారం ఇచ్చారు, జగనన్నకు ఐదేళ్లు అధికారం ఇచ్చారు. ఇక మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా నిలదీయకపోతే... ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, కడప స్టీల్ ప్లాంట్, పోర్టు తెచ్చుకోకపోతే... ఇంకెప్పుడు అడుగుతారు? దీనికి సమాధానం చెప్పాలి. 

25 మంది ఎంపీలు ఉన్నారు... ఒక్కసారైనా మూకుమ్మడి రాజీనామాలు చేసుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా? ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశారా? ప్రజల కోసం కొట్లాడాలి అని ఒక్కసారైనా అనుకున్నారా? మోదీని కనీసం ప్రశ్నించారా? ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది. ఇవాళ మోదీ రాష్ట్రాన్ని అతి హీనంగా చూస్తున్నారు. 

రూ.46 లక్షల కోట్ల బడ్జెట్ ప్రకటించారు... అందులో మోదీ ఏపీకి ఏం కేటాయించారు? రాష్ట్రానికి మోదీ ఏం చేయనప్పుడు ఆయనకు మీరు ఎందుకు గులాంగిరీ చేస్తున్నారో చెప్పాలి" అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.

More Telugu News