Vijay: కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన హీరో విజయ్

  • తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్
  • లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడి
  • తమిళనాడు రాజకీయాల్లో అవినీతి పెరిగి పోయిందని విమర్శ
Tamil Superstar Vijay Launches Political Party Tamizha Vetri Kazhagam

తమిళ గడ్డపై మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ సీనీ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ... ఈ ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేయదని... అలాగే ఏ పార్టీకి మద్దతు ప్రకటించదని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు.

 తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని... అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాని పూర్తి చేసి, ఇక పూర్తి సమయాన్ని రాజకీయ సేవకు వినియోగిస్తానని విజయ్ చెప్పారు. ప్రజాసేవకు రావడాన్ని తనను ఇంతటి వాడిని చేసిన తమిళ ప్రజలకు కృతజ్ఞత తెలుపుకోవడంగా పరిగణిస్తున్నానని అన్నారు. 

తమిళ సినీ రంగంలో రజనీకాంత్ తర్వాత అంతటి ఇమేజ్ ఉన్న నటుడు విజయ్. ఇప్పటి వరకు 68 సినిమాల్లో నటించారు. విజయ్ రాజకీయ పార్టీని పెడతాడనే చర్చ గత దశాబ్ద కాలంగా జరుగుతోంది. పలు సామాజిక సేవా కార్యక్రమాలను విజయ్ తన ఛారిటీ ద్వారా చేపడుతున్నారు.

More Telugu News