Rare Passport: ప్రపంచంలోనే అరుదైన పాస్ పోర్ట్ ఇదే..!

  • 500 మందికి మాత్రమే జారీ
  • మొత్తం 120 దేశాలలో గుర్తింపు
  • ‘ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా’ విశేషాలు 
This Passport Is Rarest In The World Because Only 500 People On Earth Have It

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్ గా జపాన్ పాస్ పోర్ట్ నిలవగా.. అరుదైన పాస్ పోర్ట్ గా ‘ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా’ పాస్ పోర్ట్ గుర్తింపు పొందింది. అంతర్జాతీయ ప్రయాణం నిమిత్తం ప్రపంచంలోని ఏ దేశమైనా తన పౌరులకు జారీ చేసే గుర్తింపు పత్రమే పాస్ పోర్ట్.. అయితే, భౌతికంగా ఎలాంటి ఉనికి లేకపోయినా పాస్ పోర్టులు జారీ చేయడం, వాటికి 120 దేశాలు గుర్తించడం ‘ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా’కు మాత్రమే ఉన్న ప్రత్యేకత. వాస్తవానికి ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టాను నిర్వచించడం కూడా కష్టమే.. వేల సంవత్సరాల నుంచి అస్తిత్వం నిలబెట్టుకుంటూ వస్తున్న క్యాథలిక్ వ్యవస్థ.. వైద్య సాయం అందించే సంస్థగా.. అంతర్జాతీయ దౌత్య గుర్తింపు పొందిన సంస్థగా కూడా చెప్పవచ్చు. సులభంగా చెప్పాలంటే కాస్త అటూ ఇటూగా ఇప్పుడున్న ఐక్యరాజ్య సమితిలాంటి సంస్థ. 

ఓ దేశంలాగే ‘ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా’ వ్యవహరిస్తుంది. భౌతిక సరిహద్దులు లేకున్నా రాచరికపు హోదాలు, వివిధ పదవులు, ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు, గుర్తింపు ఈ సంస్థకు ఉన్నాయి. క్రీ.శ.1300 సంవత్సరం నుంచి ఈ పాస్ పోర్ట్ లు జారీ చేస్తున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తమ సంస్థ సభ్యులకు జారీ చేసే ఈ పాస్ పోర్టులను ప్రస్తుతం ప్రపంచంలోని 120 దేశాలు గుర్తిస్తుండగా.. 113 దేశాలు వీటిని ప్రయాణ అనుమతి పత్రాలుగా అంగీకరిస్తున్నాయి. అంటే ‘ది సావరిన్ ఆర్డర్ ఆఫ్ మాల్టా’ పాస్ పోర్టు ఉన్న వారిని తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి.

ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టాకు ఓ దేశానికి ఉన్నట్లే గుర్తింపు, ఐక్యరాజ్య సమితి అబ్జర్వర్ హోదా, సొంత రాజ్యాంగం కూడా ఉన్నాయి.. లేనిదల్లా భూమి మాత్రమే. భూమి లేదు.. రోడ్లు లేవు అయినా కూడా కార్లకు లైసెన్స్ ప్లేట్ జారీ చేస్తుంటుంది. సొంతంగా కరెన్సీ, స్టాంపులను ముద్రిస్తుంటుంది. పూర్వకాలంలో రాజు, చక్రవర్తి తరహాలో ఓ గ్రాండ్ మాస్టర్ కూడా ఉంటారు. ఐదేళ్లకు ఓసారి గ్రాండ్ మాస్టర్ ను సావరిన్ కౌన్సిల్ ఎన్నుకుంటుంది. సావరిన్ కౌన్సిల్ లో వివిధ దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. వీరికి తమ దేశ పౌరసత్వంతో పాటు ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా పౌరసత్వం కూడా ఉంది. ప్రస్తుత గ్రాండ్ మాస్టర్ జాన్ టి. డన్లాప్ ప్రిన్స్ కెనడా పౌరుడు. 2022 న గ్రాండ్ మాస్టర్ గా ఎన్నికైన జాన్.. 2027 వరకు (ఐదేళ్లు) ఆ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత మరోసారి ఎన్నికయ్యేందుకు (గరిష్ఠంగా రెండుసార్లు) అవకాశం ఉంటుంది.

More Telugu News