AP Police: హైదరాబాద్ లో గంజాయి అమ్ముతూ.. పట్టుబడ్డ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు

AP Police Conistables Caught With Ganja In Hyderabad
  • డ్యూటీకి సెలవు పెట్టి కారులో గంజాయి తరలిస్తున్న వైనం
  • శుక్రవారం తెల్లవారుజామున తనిఖీల్లో పట్టుబడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లు
  • కారులో 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న బాలానగర్ పోలీసులు
హైదరాబాద్ లోని బాచుపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున సంచలనం చోటుచేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు బాలానగర్ పోలీసులకు పట్టుబడ్డారు. కారులో గంజాయి తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా డ్యూటీకి సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు తెరలేపారు. ముందస్తు సమాచారం అందడంతో తెలంగాణ పోలీసులు తనిఖీ చేపట్టడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలో గంజాయి అమ్మేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ సమాచారం అందడంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. 

శుక్రవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో ఓ కారులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. విస్తుపోయే విషయం బయటపడింది. వారిద్దరూ ఏపీ పోలీస్ శాఖకు చెందిన వారని, కాకినాడలో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారని తేలింది. విధులకు సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి వారిద్దరినీ బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వివరించారు.
AP Police
Ganja smugling
Hyderabad
Bachupalli
AP Conistables
Ganja
Kakinada

More Telugu News