YS Sharmila: ఢిల్లీలో ఈ మధ్యాహ్నం దీక్షకు దిగుతున్న షర్మిల.. శరద్ పవార్ తో భేటీ

  • ప్రత్యేక హోదాను ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్న షర్మిల
  • ఈ మధ్యాహ్నం ఏపీ భవన్ వద్ద దీక్ష
  • శరద్ పవార్ ను కలిసి మద్దతు కోరిన ఏపీసీసీ అధ్యక్షురాలు
YS Sharmila meets Sharad Pawar in Delhi before her deeksha on AP Special Status

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన షర్మిల... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. మొన్నటి వరకు ఉనికిని కోల్పోయినట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో... షర్మిల రాక కొత్త హుషారును నింపింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను ఆమె ప్రధాన అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఏపీలో సుడిగాలి పర్యటనలను చేస్తూ ఇప్పటికే వైసీపీ, టీడీపీలపై షర్మిల విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అధికార వైసీపీని ఆమె పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. దివంగత వైఎస్సార్ కు తానే అసలైన వారసురాలినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఆమె తన రాజకీయాన్ని ఢిల్లీకి మార్చారు. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఈ మధ్యాహ్నం ఆమె దీక్షకు దిగనున్నారు. ఈ దీక్ష ద్వారా ఆమె ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

కాసేపటి క్రితం ఆమె ఎన్సీపీ అధినేత, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ను కలిశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతును ఇవ్వాలని పవార్ ను కోరారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని విన్నవించారు. షర్మిల విన్నపం పట్ల పవార్ సానుకూలంగా స్పందించారు. పార్లమెంటులో ఈ విషయంపై మాట్లాడతామని హామీ ఇచ్చారు.

More Telugu News