Dog Attack: శంషాబాద్ లో ఘోరం.. వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి

  • ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన తల్లి
  • అమ్మ కోసం ఏడుస్తూ గుడిసె బయటకొచ్చిన బాలుడు
  • కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు
 Boy Mauled to Death by Stray Dogs in Shamshabad

శంషాబాద్ లో గురువారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడాది వయసున్న బాలుడు స్పాట్ లోనే చనిపోయాడు. వాహనదారులు గమనించి బాలుడిని కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగంలేకుండా పోయింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన కోళ్ల సూర్యకుమార్, యాదమ్మ దంపతులు శంషాబాద్ కు వలస వచ్చారు. రాళ్లగూడ సమీపంలో ఓ గుడిసెలో ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు కాగా.. అందులో ఒకరు అనారోగ్యంతో, మరొకరు పుట్టిన వారం రోజులకే చనిపోయారు.

ప్రస్తుతం నిండు గర్భిణి అయిన యాదమ్మ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా.. కొడుకు నాగరాజుతో కలిసి సూర్యకుమార్ గుడిసెలో ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి నాగరాజు నిద్రలేచి ఏడవడంతో సూర్యకుమార్ పాలు పట్టించి మళ్లీ నిద్రపుచ్చాడు. అయితే, తెల్లవారుజామున మరోసారి నిద్రలేచిన నాగరాజు.. అమ్మ కనిపించకపోవడంతో ఏడుస్తూ గుడిసె బయటకు వచ్చాడు. దీంతో వీధికుక్కలు నాగరాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి వాటిని తరిమేశారు. అయితే, అప్పటికే ఆ బాలుడు చనిపోయాడు. ఇప్పటికే ఇద్దరు కుమారులను కోల్పోయిన సూర్యకుమార్, యాదమ్మ దంపతులు.. తాజాగా వీధికుక్కలు మరో కొడుకును పొట్టనబెట్టుకోవడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

More Telugu News