Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

  • కృష్ణా బోర్డుపై 27వ తేదీ లేఖ ప్రామాణికమా? ఇవాళ్టి మీటింగ్‌లో అంగీకారం ప్రామాణికమా? అని ప్రశ్న
  • ఇక చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి అన్న హరీశ్ రావు
  • ప్రాజెక్టులు అప్పగించేది లేదని ఓ వైపు చెబుతూ... మరోవైపు సమావేశాల్లో అంగీకరిస్తారని వ్యాఖ్య
  • గెజిట్ ఇచ్చి ఒత్తిడి తెచ్చినా ప్రాజెక్టులు ఇచ్చేందుకు తాము అంగీకరించలేదన్న హరీశ్ రావు
Harish rao fires at Congress government

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గందరగోళంలో ఉందని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై ఆయన స్పందించారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించిన అంశాలనే పేర్కొంటూ 27న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఇవాళ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు మీడియా ముందు ప్రకటించారన్నారు. కాబట్టి 27వ తేదీ లేఖ ప్రామాణికమా? ఇవాళ్టి మీటింగ్‌లో అంగీకారం ప్రామాణికమా? చెప్పాలన్నారు.

ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించారని తాను చెబితే.. హరీశ్ రావు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారని... తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షిస్తామని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పారని... కానీ ఇవాళ ఏం జరిగింది? శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.

చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి

ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి అనే విషయం గుర్తించాలన్నారు. వేసవిలో, రేపు అవసరమైతే తాగునీటి కోసం నీరు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందా? జలవిద్యుత్ హౌస్‌ల గురించి చర్చ లేదని చెప్తున్నారు కానీ, నీరు లేకుండా విద్యుత్ ఎలా వస్తుంది? బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. బోర్డు అనుమతిలేనిదే రాష్ట్ర ఇంజనీర్లు, అధికారులు కనీసం ప్రాజెక్టుల వద్దకు వెళ్ళే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం, ఆంధ్రప్రదేశ్ చేతిలో పెట్టడమా? అని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు కట్టబెట్టిన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మంతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా? అందరితో చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ ఎలా అంగీకరించింది? ప్రాజెక్టులు అప్పగించేది లేదని ఓ వైపు చెబుతారు... మరోవైపు సమావేశాల్లో అధికారులు అంగీకరించి వస్తారని వ్యాఖ్యానించారు. శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని... ఇవాళ ఈఎన్సీ కృష్ణా బోర్డు మీటింగ్‌కు వెళ్లి ప్రాజెక్టుల నిర్వహణ బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించి వచ్చారన్నారు.

గెజిట్ ఇచ్చి ఒత్తిడి తెచ్చినా ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించలేదన్న హరీశ్ రావు

2021లో కేంద్రం గెజిట్ ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరో... ఈ అంశంతో తేలిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలని సూచించారు. తాను రాజకీయాల కోసం మాట్లాడడం లేదని... రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలన్నారు. మేధావులు మౌనం వీడాలని కోరారు.

More Telugu News