KCR: రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలవడంపై స్పందించిన కేసీఆర్... కీలక సూచన

KCR suggestion to MLAs over meeting with Revanth Reddy
  • ఎమ్మెల్యేలు ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే ముందుగా సమాచారం ఇవ్వాలన్న కేసీఆర్
  • కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని... ఏదో విని చెబితే ఆ ట్రాప్‌లో పడవద్దన్న బీఆర్ఎస్ అధినేత
  • మంత్రులకు ప్రజల మధ్యే విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని సూచన
  • ఎంపీలకు దిశా నిర్దేశనం చేసిన బీఆర్ఎస్ అధినేత
మన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలంటే ముందుగా సమాచారం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గురువారం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని... ఏదో విని చెబితే ఆ ట్రాప్‌లో పడవద్దన్నారు. మనం మంచి ఆలోచనతో ప్రభుత్వంలో ఉన్నవారిని కలిసినా జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు.

అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి... అయితే జనం మధ్య ఉన్నప్పుడే ఆ పని చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిని కలవడానికి ముందుగా పార్టీకి సమాచారం ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్‌ను బొందపెడతామని కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారని... వారి మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

రాజీలేని పోరాటాలతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందామని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ రాజీలేని పోరాటాలతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందన్నారు.

అది వాళ్ల చేతుల్లోనే ఉంది

ఓటమితో నిరుత్సాహం, భయం అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని... ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? ఉండదా? అనేది వాళ్ల చేతుల్లోనే ఉందన్నారు. మనం మాత్రం ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిద్దామన్నారు. 

ఎంపీలతో మాట్లాడిన కేసీఆర్

కృష్ణా నదిపై ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధికి ఇవ్వాలన్న కేంద్రం ప్రతిపాదనలపై కేసీఆర్... ఎంపీలతో చర్చించారు. ఈ అంశానికి సంబంధించి ఢిల్లీలో ఆందోళన చేపట్టాలన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేయాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరసనలు చేపట్టాలని... కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి కూడా నిరసన చెప్పాలని సూచించారు.
KCR
BRS
Revanth Reddy
Congress

More Telugu News