Hemant Soren: ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ ను పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపర్చిన ఈడీ

  • భూకుంభకోణంలో మనీలాండరింగ్ కేసు
  • హేమంత్ సోరెన్ ను నిన్న అరెస్ట్ చేసిన ఈడీ
  • నిన్ననే సీఎం పదవికి రాజీనామా చేసిన సోరెన్
  • ఒక్క రోజు జ్యుడిషియల్ కస్టడీ విధించిన పీఎంఎల్ఏ కోర్టు
ED produces Hemant Soren before PMLA Court

భూకుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ ను అరెస్ట్ చేసి, సుదీర్ఘంగా విచారించింది. 

అనంతరం, నేడు ఆయనను రాంచీలోని పీఎంఎల్ఏ (ప్రివెంటివ్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కోర్టులో హాజరుపరిచింది. పీఎంఎల్ఏ కోర్టు హేమంత్ సొరెన్ కు ఒక్క రోజు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

ఈడీ తనను అరెస్ట్ చేయడం అక్రమం అంటూ ఆక్రోశిస్తున్న హేమంత్ సోరెన్ ఆ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఝార్ఖండ్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దర్యాప్తు సంస్థ దుర్మార్గంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. తన పిటిషన్ ను అత్యవసర ప్రాతిపదికన విచారించాలని సోరెన్ కోరారు. అందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు రేపు (ఫిబ్రవరి 2) ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. 

కాగా, హేమంత్ సోరెన్ అరెస్ట్, తదితర పరిణామాలపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కక్ష సాధింపు రాజకీయాలను నమ్ముకుంటున్నారని విమర్శించారు. విపక్ష నేతలను రాజకీయంగా వేధించడమే వారి లక్ష్యమని అన్నారు. 

"దేశంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర విజయవంతం కాకూడదు... అదే వారి ఉద్దేశం. లాలు, ఆప్ నేతలు, స్టాలిన్ సహచరులు ఇలా అందరినీ ఈడీ, సీబీఐ ప్రశ్నిస్తున్నాయి... ఇవి మోదీ, అమిత్ షా ప్రతీకార రాజకీయాలకు నిదర్శనాలు" అంటూ జైరాం రమేశ్ ధ్వజమెత్తారు.

More Telugu News