medaram: మేడారం వచ్చే భక్తులకు అటవీశాఖ శుభవార్త... ఆ ఛార్జీ మినహాయింపు

  • మేడారం జాతర ముగిసేవరకు పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు మంత్రి సురేఖ వెల్లడి
  • ఫిబ్రవరి 2 నుంచి 29వ తేదీ వరకు పర్యావరణ రుసుము వసూలును నిలిపివేయనున్నట్లు అటవీశాఖ వెల్లడి
  • వాహనదారులకు తప్పనున్న ఇబ్బందులు 
Forest department fee exempted from Medaram devotees

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సందర్భంగా అటవీశాఖ భక్తులకు శుభవార్త చెప్పింది. మేడారం జాతర ముగిసేవరకు పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచన మేరకు సంబంధిత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ రుసుము చెల్లింపు నిలిపివేత నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రేపటి (ఫిబ్రవరి 2) నుంచి 29వ తేదీ వరకు పర్యావరణ రుసుము వసూలును నిలిపివేయనున్నట్లు అటవీశాఖ తెలిపింది. ఈ మేరకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నుంచి ఉత్తర్వులు అందాయి.

ప్రభుత్వ నిర్ణయంతో మేడారం జాతరకు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అవుతుంది. ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి, ఏటూరు నాగారం ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల నుంచి నామమాత్రపు పర్యావరణ రుసుమును ఇప్పటిదాకా అటవీ శాఖ వసూలు చేస్తోంది. ఇలా వచ్చే ఆదాయంలో అటవీ ప్రాంతాల రక్షణకు, ప్లాస్టిక్‌ను తొలగించేందుకు, వన్యప్రాణుల రక్షణకు వినియోగిస్తోంది. అయితే మేడారం జాతర నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి విజ్జప్తి మేరకు జాతర ముగిసే వరకు ఈ ఫీజు వసూలును నిలిపివేయనున్నారు.

More Telugu News