Harish Rao: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానమైనా గడ్డి పెట్టాలి: హరీశ్ రావు కౌంటర్

  • రేవంత్ రెడ్డి చెప్పేది కొండంత, చేసేది గోరంత కూడా లేదన్న హరీశ్ రావు
  • 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి... నియామక పత్రాలు ఎలా ఇచ్చారు? అని ప్రశ్న
  • తొమ్మిదిన్నరేళ్లలో 1.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న బీఆర్ఎస్ నేత
Harish Rao counter to Revanth Reddy

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన అల్లుడు హరీశ్ రావుకు గడ్డి పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్ఠానమైనా గడ్డి పెట్టాలని చురక అంటించారు. రేవంత్ రెడ్డి చెప్పేది కొండంత కానీ చేసేది గోరంత కూడా లేదన్నారు. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని విమర్శించారు. తామే రిక్రూట్మెంట్ చేసినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం వంచించిందని అబద్ధపు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి... నియామక పత్రాలు ఎలా ఇచ్చారు? అని నిలదీశారు. తమకు కుళ్లు ఏమీ లేదని... కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సొమ్మొక్కడిది సోకు ఇంకొకడిది అన్నట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ప్రస్తుతం రేవంత్ ఇచ్చిన నర్సుల నియామక పత్రాలు అని గుర్తుంచుకోవాలన్నారు. నర్సులుగా ఉద్యోగాలు పొందిన వారికి కూడా వాస్తవం తెలుసునని వ్యాఖ్యానించారు.

వారి ఆశలపై నీళ్లు జల్లారు

గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారన్నారు. ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు పత్రికల్లో మొదటి పేజీలో ఇందుకు సంబంధించి ప్రకటనలు వచ్చాయని గుర్తు చేశారు. తాను వాస్తవాలు మాట్లాడుతుంటే శాపనార్థాలు మాట్లాడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి ఆరోపించడం విడ్డూరమన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు పెంపు, రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.4000 పెన్షన్, మహిళలకు రూ.2500, ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ కూడా అమలు కాని హామీల జాబితాలో చేరిందన్నారు.

తొమ్మిదిన్నరేళ్లలో 1.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం

2004 నుంచి 2014 వరకు పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. కానీ తాము తొమ్మిదన్నరేళ్ల కాలంలో 1.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరో 40వేల పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ మాటను నిలబెట్టుకుంటే తాము స్వాగతిస్తామన్నారు. రోజూ అబద్ధాలు చెప్పే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానమైనా గడ్డి పెట్టాలని కోరారు.

More Telugu News