Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి... కీలక ఆదేశాలు

  • సిబ్బంది కొరతను అధిగమించేందుకు హోంగార్డులను నియమించుకోవాలని సూచన
  • రద్దీ సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ కంట్రోల్ విధులకు ఉపయోగించుకోవాలన్న సీఎం
  • మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలన్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy review on Hyderabad traffic issue

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు... సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంతమంది హోంగార్డుల నియామకాలను చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను ట్రాఫిక్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ హోంగార్డు నియామకాలకు మూడు నెలల్లోగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వివిధ విభాగాల్లో పని చేస్తోన్న హోంగార్డులను వెంటనే ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించి ట్రాఫిక్ నియంత్రణ విధులకు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

రద్దీ సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను నగర ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పుడున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలన్నారు. సరిపడా సంఖ్యలో సిబ్బంది ఉండేలా స్టేషన్లను పునర్వ్యవస్థీకరించాలని... నగరంలో రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్‌లలో ఎల్బీనగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థపై ఆధారపడకుండా సిబ్బంది ఉండాలన్నారు.

ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలన్నారు. కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు. నెలకోసారి సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించాలని సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమిషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు.

More Telugu News