Jay Shah: ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా జై షా హ్యాట్రిక్

  • వరుసగా మూడోసారి ఏసీసీ అధ్యక్షుడిగా జై షా
  • నేడు ఇండోనేషియాలో ఏసీసీ వార్షిక సర్వ సభ్య సమావేశం
  • జై షా పేరును ప్రతిపాదించిన శ్రీలంక క్రికెట్ బోర్డు చీఫ్
  • ఏకగ్రీవంగా బలపరిచిన మిగతా సభ్య దేశాలు
Jay Shah elected third time as ACC President

కేంద్ర హోం మంత్రి తనయుడు జై షా ఇప్పటికే భారత క్రికెట్ పై తనదైన ముద్ర వేశారు. క్రమంగా అంతర్జాతీయ క్రికెట్ లోనూ తన ప్రాభవం పెంచుకుంటున్నారు. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా... అటు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. గత రెండు పర్యాయాలుగా ఏసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జై షా... తాజాగా మూడోసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఇండోనేషియాలోని బాలిలో నేడు ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో... మరోసారి ఏసీసీ అధ్యక్షుడిగా జై షా పేరును శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్ సీ) అధ్యక్షుడు షమ్మీ సిల్వా ప్రతిపాదించారు. మిగతా సభ్య దేశాలన్నీ ఆ ప్రతిపాదనను ముక్తకంఠంతో బలపరిచాయి. దాంతో వరుసగా మూడోసారి కూడా ఏసీసీ అధ్యక్షుడిగా జై షా నియమితులయ్యారు. 

దీనిపై జై షా స్పందిస్తూ, ఆసియా క్రికెట్ మండలి సభ్యదేశాలన్నీ తన పట్ల మరోసారి నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి ఏసీసీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.

More Telugu News