YCP Rebel MLAs: వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యాలయం నోటీసులు

  • ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు
  • నోటీసులపై ఫిబ్రవరి 5లోపు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
  • ఫిబ్రవరి 8న స్వీకర్ ముందు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు
Ap speaker office issues notices to YCP rebel mlas

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి శాసనసభ అధికారులు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 5 లోపు నోటీసులపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు. ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ముందు విచారణకు హాజరు కావాలని కూడా పేర్కొన్నారు. 

అంతుకుముందు జరిగిన విచారణలో కొంతమంది సభ్యులు పంపిన సీడీలు, పెన్ డ్రైవ్‌లు ఓపెన్ కావడంలో లేదని రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పారని అధికారులు తెలిపారు. దీంతో, వారి పరిశీలన కోసం మళ్లీ పెన్ డ్రైవ్‌లు, సీడీలు పంపుతున్నామని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. ఈ విషయంలో అవసరమైన సాయం కోసం శాసనసభ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.

కాగా, జనవరి 29న స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు. తాజా నోటీసుల ప్రకారం, స్పీకర్ వారిని ఫిబ్రవరి 8న ఒకేసారి విచారించనున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు వైసీపీ చీఫ్ విప్ ప్రసాదరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News