Arvind Kejriwal: మద్యం పాలసీ కేసు... అరవింద్ కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ నోటీసుల జారీ

  • ఫిబ్రవరి 2వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ
  • గతంలో నవంబర్ 2, డిసెంబర్ 22, జనవరి 3, జనవరి 13వ తేదీల్లో నోటీసులు
  • రాజకీయ దురుద్దేశ్యంతో నోటీసులు ఇస్తున్నారంటున్న కేజ్రీవాల్
ED summons Arvind Kejriwal for fifth time

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మద్యం పాలసీ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఈ నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 2వ తేదీన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనకు నోటీసులు ఇవ్వడం ఇది ఐదోసారి. గతంలో నాలుగుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. జనవరి 18న విచారణకు హాజరు కావాలని జనవరి 13వ తేదీన చివరిసారి నోటీసులు జారీ చేసింది. అంతకుముందు నవంబర్ 2న, డిసెంబర్ 22న, జనవరి 3న నోటీసులు ఇచ్చింది.

అయితే ఇదంతా రాజకీయ దురుద్దేశ్యంతో సాగుతోందని ఆరోపిస్తూ కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదు. లోక్ సభ ఎన్నికలకు ముందు నోటీసులు ఇవ్వడం ఏమిటి? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి, లోక్ సభ ఎన్నికల్లో ప్రచారానికి ఆయనను దూరం చేసే ఉద్ధేశ్యం బీజేపీలో కనిపిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ నిందితుడు కాదని స్వయంగా ఈడీయే పేర్కొందని... అలాంటప్పుడు ఆయనకు నోటీసులు ఎలా ఇస్తుంది? అని ప్రశ్నిస్తోంది.

More Telugu News