Droupadi Murmu: జీవితంలో తొలిసారి పేదరిక నిర్మూలన చూస్తున్నా.. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం

First time seeing poverty eradication in country says President Murmu
  • పార్లమెంటు నూతన భవనంలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
  • ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
  • తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కాబోతోందన్న రాష్ట్రపతి
  • గత పదేళ్లలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారన్న ముర్ము
తన చిన్నప్పటి నుంచి ‘గరీబీ హటావో’ నినాదం గురించి వింటూ ఉన్నానని, కానీ తన జీవితంలో తొలిసారి పెద్ద ఎత్తున పేదరిక నిర్మూలనను చూస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేడు పార్లమెంటు నూతన భవనంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు. నూతన భవనంలో ఇదే తన తొలి ప్రసంగమని పేర్కొన్న ముర్ము.. పలు కీలక విషయాలపై ప్రసంగించారు. 

తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కానుందని, ఆదివాసీ యోధులను స్మరించుకోవడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. భగవాన్ బిర్సాముండా జన్మదినాన్ని జన్ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నట్టు చెప్పారు. శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందని తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ గతేడాది చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. అలాగే, సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించామని, జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకున్నామని వివరించారు. 

భారత్ తొలిసారి ఆసియా క్రీడల్లో 107, పారా ఒలింపిక్స్‌లో 111 పతకాలు సాధించిందని ప్రశంసించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీశక్తి వందన్ అధినియం బిల్లును ఆమోదించుకున్నట్టు తెలిపారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందని, గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. రామమందిర కల సాకారమైందని, ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకింగ్ రంగాల్లో భారత్ ఒకటని రాష్ట్రపతి ముర్ము వివరించారు.
Droupadi Murmu
Parliament Budget Session
Sammakka-Sarakka Tribal University
Telangana

More Telugu News