Deepti Sharma: టీమిండియా ఆల్ రౌండర్ దీప్తి శర్మకు డీఎస్పీ ఉద్యోగం

  • ఇటీవల ఆసియా కప్ గెలిచిన టీమిండియా మహిళల జట్టు
  • రాణించిన దీప్తి శర్మ
  • ఆల్ రౌండర్ స్థానానికి న్యాయం చేస్తున్న యువ క్రికెటర్
  • డీఎస్పీ ఉద్యోగంతో పాటు రూ.3 కోట్ల నజరానా అందించిన సీఎం ఆదిత్యనాథ్
India all rounder Deepti Sharma appointed as DSP by Uttar Pradesh govt

భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఎదిగిన దీప్తి శర్మకు ప్రతిభకు తగిన ప్రతిఫలం దక్కింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీప్తి శర్మను డీఎస్పీగా నియమించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమెకు డీఎస్పీ నియామకపత్రంతో పాటు రూ.3 కోట్ల నగదు నజరానా కూడా అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను దీప్తి శర్మ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

ప్రస్తుతం దీప్తి శర్మ వయసు 26 ఏళ్లు. యూపీలోని ఆగ్రా దీప్తి శర్మ స్వస్థలం. 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన దీప్తి శర్మ టీమిండియాలో నమ్మదగిన ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకుంది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ రాణిస్తోంది. 

ఇటీవల ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు కూడా నిర్వహించగా, భారత జట్టే చాంపియన్ గా నిలిచింది. అందులో దీప్తి శర్మ ప్రతిభకు మెచ్చిన యూపీ సర్కారు డీఎస్పీ ఉద్యోగంతో పాటు, నగదు నజరానా ప్రకటించింది. 

సీఎం చేతుల మీదుగా నియామకపత్రం, నజరానా తాలూకు చెక్ అందుకున్న అనంతరం దీప్తి శర్మ సంతోషం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తనపై చూపిస్తున్న ఆదరణను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపింది. 

దీప్తి శర్మ కెరీర్ లో ఇప్పటివరకు 104 అంతర్జాతీయ టీ20లు ఆడి 1,015 పరుగులు చేసింది. అదే సమయంలో 113 వికెట్లు పడగొట్టింది. 86 వన్డేల్లో 1,982 పరుగులు చేసి, 100 వికెట్లు తీసింది. ఇప్పటివరకు 4 టెస్టుల్లో 317 పరుగులు చేసి, 16 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో ఒక సెంచరీ నమోదు చేసింది.

More Telugu News