Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష

  • సైఫర్ కేసులో స్పెషల్ కోర్టు తీర్పు
  • ఇదే కేసులో పాక్ విదేశాంగ మంత్రికి కూడా పదేళ్ల జైలుశిక్ష 
  • గతంలో ఈ కేసును ఓ జోక్ గా కొట్టిపారేసిన ఇమ్రాన్ ఖాన్ 
Ten years prison for Pakistan former PM Imran Khan

పాకిస్థాన్ లో మరో 9 రోజుల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా, నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార రహస్యాల వెల్లడి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడింది. 

దీనిపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది నయీం పంజుతా సోషల్ మీడియాలో స్పందించారు. ఈ తీర్పును తాము అంగీకరించబోమని, ఇది అక్రమం అని పేర్కొన్నారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న అభియోగాలపై ఇమ్రాన్ ఖాన్ చాన్నాళ్లుగా విచారణ ఎదుర్కొంటున్నారు. 

ఈ కేసు 'సైఫర్ కేసు'గా ప్రసిద్ధికెక్కింది. గతేడాది అమెరికాలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఓ రహస్య కేబుల్ (సైఫర్)ను పాక్ ప్రభుత్వానికి పంపింది. ఈ కేబుల్ ను ఇమ్రాన్ ఖాన్ బహిర్గతం చేశారన్నది సైఫర్ కేసులో ప్రధాన అభియోగం. అధికార రహస్యాల చట్టం కింద ఈ కేసు విచారణ చేపట్టారు. 

ఇమ్రాన్ ఖాన్, షా మహ్మద్ ఖురేషీ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ఇది హై సెక్యూరిటీ కారాగారం. 

కాగా, ఇమ్రాన్ ఖాన్ ఈ కేసు విచారణను ఓ జోక్ అని గతంలో కొట్టిపారేశారు. ప్రాసిక్యూషన్ బృందం, డిఫెన్స్ బృందం అందరూ ప్రభుత్వానికి చెందినవారే అయినప్పుడు తమకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. 

లండన్ లోని కొందరు వ్యక్తులు పక్కా ప్రణాళికతో ఈ తంతు నడిపించారని, ఈ కేసులో ఎలాంటి  తీర్పు వస్తుందో తనకు ముందే తెలుసని ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వంటిదేనని విమర్శించారు. కాగా, నేడు స్పెషల్  కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News