tmc: బెంగాల్‌లో పొత్తు వివాదం... కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ మేనల్లుడు తీవ్ర విమర్శలు

  • I.N.D.I.A. కూటమిలో విభేదాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శ
  • గత ఏడాది జులై నుంచి సీట్ల సర్దుబాటు కోసం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్య
  • డిసెంబర్ 31 కల్లా ఓ నిర్ణయానికి రావాలని మమతా బెనర్జీ చెప్పారని వెల్లడి
TMC Abhishek Banarjee miffed over delay in seat sharing talks

కూటమి నిబంధనల ప్రకారం సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తే తృణమూల్ కాంగ్రెస్ I.N.D.I.A. కూటమిలోనే కొనసాగుతుందని మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. ఆయన సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. I.N.D.I.A. కూటమిలో విభేదాలకు ఆ పార్టీయే కారణమని ఆరోపించారు. కూటమి నిబంధనల ప్రకారం తొలుత సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి రావాలని... ఈ విషయమై గత ఏడాది జులై నుంచి తాము ఎదురు చూస్తున్నామన్నారు. కానీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఎన్నోసార్లు చర్చలు జరిపామని... సీట్ల సర్దుబాటుపై డిసెంబర్ 31 కల్లా ఓ నిర్ణయానికి రావాలని చివరిసారి ఢిల్లీలో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ వారి నుంచి సమాధానం రాలేదని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారని... దీంతో ఆయన ఏం ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు? అని ప్రశ్నించారు. తమ సహనానికి కూడా హద్దు ఉంటుందని అర్థం చేసుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవని... ఇంకా సీటు షేరింగ్ గురించి చర్చించుకోకుంటే ఎలా అన్నారు.

More Telugu News