freedom fighter: 49 ఏళ్ల మహిళను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న 103 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు

  • రెండవ భార్య మరణానంతరం మూడో వివాహం చేసుకున్న హబీబ్ నాజర్ అనే స్వాతంత్ర్య సమరయోధుడు
  • ఒంటరిగా మారిపోయిన తాను ఒంటరి మహిళను పెళ్లి చేసుకున్నానని వెల్లడి
  • గతేడాది జరిగిన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌
A 103 year old freedom fighter married a 49 year old woman in Bhopal

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ స్వాతంత్ర్య సమరయోధుడు 103 ఏళ్ల వయసులో 49 సంవత్సరాల మహిళను పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వాతంత్ర్య సమరయోధుడు హబీబ్ నాజర్‌కు ఇది మూడవ వివాహమని, రెండవ భార్య చనిపోయిన తర్వాత ఆయన మూడవ పెళ్లి చేసుకున్నారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. రెండవ భార్య మరణం తర్వాత ఒంటరిగా మారిపోయాడని తెలిపాయి. తాజాగా తనకంటే 54 ఏళ్లు తక్కువ వయసున్న ఫిరోజ్ జహాన్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారని రిపోర్టులు పేర్కొన్నాయి. 

అయితే వీరిద్దరి వివాహం గతేడాదే జరిగినప్పటికీ ఆ వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిందని, అందుకే విషయం వెలుగులోకి వచ్చిందని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వివాహం అనంతరం ఆటో-రిక్షాలో నూతన దంపతులు ఇంటికి తిరిగివస్తున్నట్టుగా వీడియోలో ఉంది. వీరిని చూసి కొందరు నవ్వుతుండడం వీడియోలో కనిపించింది. 

ఇక 103 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడంపై హబీబ్ నాజర్‌ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘ నా వయస్సు 103 ఏళ్లు. నా భార్య వయస్సు 49 సంవత్సరాలు. నాసిక్‌లో నా మొదటి భార్య చనిపోయినప్పుడు జీవితంలో మొదటిసారి ఒంటరిగా మారాను. రెండో పెళ్లి చేసుకోవడానికి లక్నో వెళ్లాను. అయితే నా రెండో భార్య కూడా ఈ లోకం వదిలి వెళ్లిపోయింది. మళ్లీ ఒంటిరిగా మారిపోయాను. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒంటరిగా ఉన్న జహాన్ కూడా నాతో కలిసి ప్రయాణాన్ని సాగించడానికి సిద్ధంగా ఉంది’’ అని హబీబ్ నాజర్ తెలిపారు. కాగా తన భర్త పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని జహాన్ పేర్కొంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, హబీబ్‌ను పెళ్లి చేసుకోవాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమని ఆమె చెప్పింది.

More Telugu News