Sarfraz Khan: ఎట్టకేలకు టీమిండియా నుంచి పిలుపు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్

  • దేశవాళీల్లో పరుగుల మోత మోగిస్తున్న సర్ఫరాజ్ ఖాన్
  • చాన్నాళ్లుగా టీమిండియా బెర్తు కోసం వేచి చూస్తున్న వైనం
  • ఇంగ్లండ్ తో రెండో టెస్టుకు జడేజా, కేఎల్ రాహుల్ దూరం
  • సర్ఫరాజ్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ లను ఎంపిక చేసిన సెలెక్టర్లు
Sarfraz Khan finally got the call from Team India

గత మూడు సీజన్లుగా దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్న ముంబయి బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ కు ఎట్టకేలకు టీమిండియాకు ఆడే అవకాశం లభించింది. ఇంగ్లండ్ తో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో బాధపడుతున్నారని బీసీసీఐ నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది. వారి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్ లతో పాటు వాషింగ్టన్ సుందర్ ను కూడా ఎంపిక చేసినట్టు వివరించింది. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరగనుంది.

రెండో టెస్టుకు టీమిండియా ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభ్ మాన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, అవేష్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్. 

దేశవాళీల్లో పరుగుల రారాజు... సర్ఫరాజ్

భారత దేశవాళీ క్రికెట్లో ఇప్పుడున్న ప్రతిభావంతుల్లో సర్ఫరాజ్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. అందులో ఎవరికీ సందేహం లేదు. కానీ ఇన్నాళ్లుగా ఎందుకు టీమిండియా గడప తొక్కలేకపోయాడంటే అందుకు కారణాలు చెప్పడం కష్టం. 

సెలెక్టర్లు ప్రతిసారి మొండిచేయి చూపిస్తుండడంతో ఓసారి సెంచరీ సాధించిన తర్వాత సహనం కోల్పోయి స్టేడియంలో ఉన్న సెలెక్టర్ కు వార్నింగ్ ఇస్తున్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇక, సర్ఫరాజ్ గణాంకాలు చూస్తే... 2019 నుంచి రంజీల్లో మనవాడు పరుగులు వెల్లువెత్తిస్తున్నాడు. 2019-20 సీజన్లో 154.7 సగటుతో 928 పరుగులు... 2021-22 సీజన్లో 122.8 సగటుతో 982 పరుగులు... 2022-23 సీజన్లో 92.6 సగటుతో 556 పరుగులు నమోదు చేశాడు. ఈ ఏడాది ఇండియా-ఏ తరఫున ఇంగ్లండ్ లయన్స్ పై ఆడుతూ సెంచరీ బాదాడు.

More Telugu News