Revanth Reddy: మెడికల్ కాలేజీ ఉన్న ప్రతిచోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండాలి: రేవంత్ రెడ్డి

  • బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలని ఆదేశాలు
  • ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యసేవల కోసం అవసరమైతే స్వయంగా తానే కేంద్రమంత్రిని కలుస్తానన్న సీఎం
  • ఉస్మానియా ఆసుపత్రి విస్తరణ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు
  • ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలని ఆదేశం
CM Revanth Reddy review on the Medical and Health Department in the Secretariat

రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ఉన్న ప్రతిచోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు చేపట్టాలని... ఇందుకోసం కామన్ పాలసీని తీసుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కొడంగల్‌లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలన్నారు.

ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. తద్వారా ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తి స్థాయి రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించారు. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యసేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని చెప్పారు.

ఉస్మానియా విస్తరణ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి...

ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలోని సమస్యలను అధికారులు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. ఉస్మానియాపై మంగళవారం హైకోర్టులో విచారణ ఉందని అధికారులు గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి... కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు సాగుదామన్నారు.

ఏరియాల వారీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్నింటిని గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి సూచించారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యత పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలన్నారు. నిర్వహణ ఖర్చు వారే భరించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలని ఆదేశం

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి... అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న... ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతీ నెల 15వ తేదీలోగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలన్నారు. ప్రతీ మూడు నెలలకు ఓసారి విధిగా ప్రయివేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలన్నారు.

More Telugu News