KTR: కాంగ్రెస్ ఐదేళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది వేచి చూద్దాం: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KCR interesting comments on Congress government
  • రైతు భరోసా ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికలపై అబద్ధం చెప్పారని విమర్శ
  • కానీ ఇప్పటి వరకు రైతు బంధు కూడా పడలేదన్న కేటీఆర్
  • అధికారంలో ఉన్నామనే విషయాన్ని మరిచి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే బట్టలిప్పి నిలబెడతామని హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది వేచి చూద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతుభరోసా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పారని... కానీ రైతుబంధు ఇప్పటివరకు పడలేదన్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతీసి కొడతామని కాంగ్రెస్ నేతలు అన్నారన్నారు. రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్‌ను రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటుతో కొడదామని పిలుపునిచ్చారు. అధికారంలో వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని... దానిని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తానని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

అధికారంలో ఉన్నామనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో పని చేసిందని... అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపించామన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు మనకు మూడోవంతు సీట్లను ఇవ్వడం ద్వారా బలమైన ప్రతిపక్షంగా పని చేయమని చెప్పారని వ్యాఖ్యానించారు. మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రిపబ్లిక్ డే రోజున గవర్నర్ ప్రసంగం సామాన్య కార్యకర్త ప్రసంగం కంటే దారుణంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు రావడం లేదన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని... ఆ హామీలను అమలు చేయకుంటే బట్టలిప్పి నిలబెడతామని హెచ్చరించారు. ఇష్టారీతిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఇరుక్కుపోయిందన్నారు. కాంగ్రెస్ ఐదేళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది వేచి చూద్దామన్నారు. పార్లమెంటు ఎన్నిల కోడ్ రాకముందే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి వస్తారన్నారు. దేశానికి... తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు.
KTR
BRS
Revanth Reddy
Congress
Lok Sabha Polls
Telangana
TS Politics

More Telugu News