G. Kishan Reddy: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తుపై కిషన్ రెడ్డి క్లారిటీ

  • పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న కిషన్ రెడ్డి
  • కేసీఆర్ కుటుంబం అహంకారపూరితంగా మాట్లాడుతోందని ఆగ్రహం
  • లోక్ సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేడర్‌కు పిలుపు
  • I.N.D.I.A. కూటమి అప్పుడే విచ్ఛిన్నమవుతోందన్న కిషన్ రెడ్డి  
Kishan Reddy says no alliance with any party

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని... బీఆర్ఎస్ సహా ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం శక్తి వందన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ... భారతీయులు అంటే గతంలో విదేశాల్లో లెక్కచేసేవారు కాదని... కానీ ఇప్పుడు భారత పాస్‌పోర్ట్ ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా మంచి గౌరవం దక్కుతోందని అన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం తమ పార్టీపైనా, పార్టీ నేతలపైనా అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ నాయకులు కూడా కేసీఆర్ కుటుంబం మాదిరి మాట్లాడరన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో 32 జిల్లాలకు జాతీయ రహదారులను కేంద్రం అనుసంధానం చేసిందన్నారు. కేంద్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా బీజేపీ పాలన చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రంపై భారం మోపిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తుంది? అనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందన్నారు. గతంలో తెలంగాణలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగాయని... ఇప్పుడు వారం అటు ఇటుగా ఉండవచ్చునని... అందరూ సిద్ధంగా ఉండాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.

I.N.D.I.A. కూటమిపై విమర్శలు

I.N.D.I.A. కూటమి అప్పుడే విచ్ఛిన్నమవుతోందని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని.. ఆ కుంభకోణాల వల్లే కేంద్రంలో ఆ పార్టీ అధికారానికి దూరమైందన్నారు. కాంగ్రెస్ అవినీతిపై విసిగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. మోదీ నాయకత్వంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. స్వయంగా ప్రధాని వచ్చి వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను సందర్శించి ధైర్యం చెప్పారన్నారు. మోదీని విమర్శించే స్థాయి విపక్షాలకు లేదని మండిపడ్డారు. ఎలాంటి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలలో కనీసం రోడ్లు కూడా ఉండేవి కావని.. ఇప్పుడు జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. కాగా, శక్తి వందన్ వర్క్ షాప్ కార్యక్రమంలో కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు, ముద్రా యోజన రుణాలపై కిషన్ రెడ్డి అవగాహన కల్పించారు.

More Telugu News