Nara Lokesh: ఎస్సై శ్రీహరి వంటి పోలీసులు కఠిన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి: నారా లోకేశ్

  • పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న లోకేశ్
  • ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీసులు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని మండిపాటు
  • ఎస్సై శ్రీహరి వేధింపులు భరించలేక దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన
Police like SI Srihari to be prepared to face serious action in next government says Nara Lokesh

ఏపీ పోలీసులు, వైసీపీ నేతల తీరుపై టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొందరు పోలీసులు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని అన్నారు. బలహీన వర్గాలపై మారణహోమం కొనసాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. వైసీపీలో చేరాలని... లేకపోతే రూ. 2 లక్షలు కప్పం కట్టాలని వేధిస్తున్నారని దుయ్యబట్టారు. 

మాచర్ల నియోజకవర్గంలో ఎస్సై శ్రీహరి వేధింపులను భరించలేక టీడీపీ సానుభూతిదారుడు దుర్గారావు బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. దుర్గారావుపై తప్పుడు కేసు బనాయించి, పార్టీ మారాలని వేధించారని మండిపడ్డారు. దుర్గారావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. 

దుర్గారావును ఆత్మహత్యకు పురిగొల్పడం పోలీసు శాఖకు మాయని మచ్చ అని మండిపడ్డారు. ఎస్సై శ్రీహరి వంటి పోలీసులు రాబోయే ప్రజా ప్రభుత్వంలో కఠిన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఏపీలో ఉన్న విపరీత పోకడలు దేశంలో మరే రాష్ట్రంలో లేవని విమర్శించారు. మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ - జనసేనల ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News