Rohit Sharma: హైదరాబాద్ టెస్టులో టీమిండియా ఓటమికి రోహిత్ శర్మ చెప్పిన కారణం ఇదే!

This is the reason Rohit Sharma said for Team Indias defeat in the Hyderabad Test
  • జట్టుగా విఫలమయ్యామని చెప్పిన హిట్‌మ్యాన్
  • రెండో ఇన్నింగ్స్‌లో తమ బ్యాటింగ్ విజయానికి సరిపోలేదని వ్యాఖ్య
  • ఒల్లీ పోప్ అసాధారణ బ్యాటింగ్ చేశాడని ప్రశంసించిన రోహిత్ శర్మ
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్‌లో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఒక జట్టుగా విఫలమయ్యామని నిస్సందేహంగా సమాధానమిచ్చాడు. మ్యాచ్ నాలుగవ ఇన్నింగ్స్‌లో తాము చేసిన బ్యాటింగ్ విజయానికి సరిపోలేదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌పై ఓటమికి ఏయే అంశాలు కారణమయ్యాయని ప్రశ్నించగా హిట్‌మ్యాన్ ఈ విధంగా సమాధానమిచ్చాడు.

"ఎక్కడ తప్పు జరిగిందో నిర్ధారించడం కష్టం. 190 పరుగుల ఆధిక్యం లభించడంతో బ్యాటింగ్‌లో బాగానే రాణించామని అనుకున్నాం. ఓల్లీ పోప్ అసాధారణమైన బ్యాటింగ్ చేశాడు. భారత పరిస్థితులలో విదేశీ బ్యాటర్లు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇదొకటి. సరైన ఏరియాల్లోనే బౌలింగ్ చేశాం. మా బౌలర్లు ప్రణాళికలను బాగానే అమలు చేశారు. కానీ పోప్‌ బాగా బ్యాటింగ్ చేశాడని చెప్పాలి. మొత్తంగా ఒక జట్టుగా మేము విఫలమయ్యాం. రెండో ఇన్నింగ్స్‌లో తగిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు. బ్యాటర్లు మ్యాచ్‌ను ఐదవ రోజుకు తీసుకెళ్లాలని కోరుకున్నాను. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చాలా బాగా పోరాడారు" అని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చెప్పాడు. 

మ్యాచ్‌లో ప్రధాన విభాగాలలో భారత్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ ఇంగ్లిష్ బ్యాటర్ ఓలీ పోప్ ఆడిన అద్భుతమైన 196 పరుగుల ఇన్నింగ్స్, స్పిన్నర్ టామ్ హార్ట్లీ 7 వికెట్ల ప్రదర్శన పర్యాటక జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది.

కాగా హైదరాబాద్ టెస్టులో భారత్ 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇవాళ నాలుగో రోజు ఆటలో 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ 7 వికెట్లతో చెలరేగాడు. భారత్ లో తన మొదటి మ్యాచ్ లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన విదేశీ బౌలర్‌గా నిలిచాడు.
Rohit Sharma
Hyderabad Test
India vs England
Cricket
Team India

More Telugu News