Nitish Kumar: బీహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా

Bihar CM Nitish Kumar resigned
  • తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత నిర్ణయం
  • గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రం అందించిన నితీశ్
  • తన నివాసంలో ఎన్డీయే ఎమ్మెల్యేలతో జేడీయూ చీఫ్ భేటీ
బీహార్ ముఖ్యమంత్రి పదవికి జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) చీఫ్ నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం పాట్నాలోని తన అధికారిక నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేలతో భేటీ అయిన నితీశ్.. వారితో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపి, రిజైన్ లెటర్ అందజేశారు. తిరిగి ఇంటికి చేరుకున్న నితీశ్.. కాసేపట్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. కాగా, జేడీయూలో ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో కలిసి నితీశ్ కుమార్ నేడో రేపో మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని రాజకీయ వర్గాల సమాచారం. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీతో సీట్ల పంపకాలకు సంబంధించి నితీశ్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

సీఎం నితీశ్ రాజీనామా చేస్తారంటూ కొన్నిరోజులుగా బీహార్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. మరోమారు ఎన్డీయే కూటమితో ఆయన జట్టుకడతారని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడవి నిజం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎన్డీయే కూటమిలోనే ఉన్న నితీశ్.. మధ్యలో బీజేపీకి కటీఫ్ చెప్పి లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపారు. అప్పట్లో కూడా సీఎం పదవికి ఉదయం రాజీనామా చేసిన నితీశ్.. లాలూ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తో పొత్తు పెట్టుకుని సాయంత్రం మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఇతర నేతలను కేబినెట్ లోకి తీసుకున్నారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ సహా పలు ప్రతిపక్షాలతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఇండియా కూటమి నుంచి కూడా  వైదొలిగినట్లేనని తెలుస్తోంది.
Nitish Kumar
Bihar CM
Resignation
JDU
NDA
RJD

More Telugu News