Nitish Kumar: బీహార్‌లో రాజకీయాల్లో ట్విస్ట్‌లు... నితీశ్ రాజీనామా... ఆ తర్వాత మళ్లీ 9వ సారి సీఎంగా ప్రమాణం?

  • ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి బీజేపీ చెంతకు నితీశ్ కుమార్?
  • రేపు ఉదయం రాజీనామా చేయవచ్చునని జాతీయ మీడియాలో వార్తలు
  • అనంతరం బీజేపీ మద్దతుతో తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం
  • ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయన్న తేజస్వి యాదవ్
Bihar CM Nitish Kumar to resign tomorrow

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రేపు ఉదయం తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నితీశ్ కుమార్ కాంగ్రెస్ నేతృత్వంలోని 28 పార్టీల I.N.D.I.A. కూటమి నుంచి బయటకు వస్తున్నారని... బీజేపీతో జత కలుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నితీశ్ కుమార్ రేపు సీఎంగా రాజీనామా చేసి.. ఆ తర్వాత బీజేపీతో జతకలిసి మళ్లీ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చునని మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీజేపీకి రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు, స్పీకర్ పదవి ఇవ్వవచ్చునని తెలుస్తోంది.

కాంగ్రెస్, ఆర్జేడీ స్పందన

నితీశ్ కుమార్ ఏం చేయనున్నారనే ప్రశ్నల మధ్య ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, రాష్ట్రంలో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయని తేజస్వి యాదవ్ ఆర్జేడీ సమావేశంలో వ్యాఖ్యానించినట్లుగా ఏఎన్ఐతో అన్నారు. నితీశ్ కుమార్‌తో మాట్లాడేందుకు తాను ప్రయత్నించానని ఆర్జేడీ నేత శివానంద్ తివారి తెలిపారు.

బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం

రేపు ఉదయం పది గంటలకు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాట్నాలోని పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. మరోవైపు, జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామీ మోర్చా పార్టీ బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వం ఏర్పడితే మద్దతిచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది.

More Telugu News