Hyderabad Test: హైదరాబాద్ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట... ఇంగ్లండ్ ఆధిక్యం 126 పరుగులు

  • ఆసక్తికరంగా తొలి టెస్టు
  • రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 316 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • ఓలీ పోప్ (148 బ్యాటింగ్) అద్భుత సెంచరీ
England gets lead against Team India in Hyderabad test

హైదరాబాదులో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పోరాట పటిమ కనబర్చింది. ఇవాళ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 316 పరుగులు చేసింది. తద్వారా 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓలీ పోప్ సెంచరీ సాధించడం హైలైట్ గా నిలిచింది. టీమిండియా బౌలర్లను ఎంతో సమర్థంగా ఎదుర్కొన్న పోప్ 208 బంతుల్లో 17 ఫోర్లతో 148 పరుగులు చేశాడు. పోప్ కు తోడుగా రెహాన్ అహ్మద్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. 

అంతకుముందు, పోప్ కు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ బెన్ ఫోక్స్ నుంచి చక్కని సహకారం లభించింది. ఫోక్స్ 34 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్  లో అవుటయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాక్ క్రాలే 31, బెన్ డకెట్ 47 పరుగులు చేశారు. జో రూట్ (2), జానీ బెయిర్ స్టో (10), కెప్టెన్ బెన్ స్టోక్స్ (6) నిరాశపరిచారు. 

టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, అశ్విన్ 2, అక్షర్ పటేల్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. 

ఈ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246 పరుగులు చేయగా, టీమిండియా 436 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

More Telugu News