TDP: పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ... టీడీపీ నేతలపై లాఠీచార్జ్!

  • వరికెపూడిసెల ప్రాజెక్టు నిర్మాణం జరపాలంటూ టీడీపీ నేతల ధర్నా
  • అనుమతి లేదన్న పోలీసులు
  • టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట
Tension rises at Palnadu Collector Office

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరికెపూడిసెల ప్రాజెక్టు నిర్మాణం జరపాలంటూ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అయితే, నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు టీడీపీ నేతలను అక్కడ్నించి పంపించేందుకు ప్రయత్నించారు. 

టీడీపీ నేతలు పోలీసులను ప్రతిఘటించడంతో అక్కడ వాగ్వాదం, తోపులాట చేసుకున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీచార్జ్ చేయగా, కొందరు టీడీపీ నేతలకు గాయాలైనట్టు తెలుస్తోంది. అయినప్పటికీ పలువురు టీడీపీ నేతలు ధర్నా కొనసాగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

పల్నాడు ప్రజల చిరకాల స్వప్నం వంటి వరికెపూడిసెల ప్రాజెక్టును నిర్మించాలని కోరేందుకు తాము ఇక్కడికి వచ్చామని, తమపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య అని, ప్రజల సమస్యను కలెక్టర్ కు చెప్పుకోకుండా ఇంకెవరికి చెప్పుకుంటామని వారు నిలదీశారు. 

ఇటీవల నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లాకు వచ్చినప్పుడు, వరికెపూడిసెల ప్రాజెక్టుపై స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తాను స్వీకరిస్తానని హామీ ఇస్తూ, వినుకొండ నియోజకవర్గంలో శిలాఫలకం కూడా ఆవిష్కరించారు. 

ఆ తర్వాత కొన్నిరోజులకే సీఎం జగన్ పల్నాడు పర్యటనలో భాగంగా మాచర్లకు వచ్చి వరికెపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 

More Telugu News