YS Sharmila: ఇదేనా వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం?: జగన్ పై మరోసారి మండిపడ్డ షర్మిల

YS Sharmila fires on Jagan during Gundlakamma project visit
  • గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన షర్మిల
  • రూ. 750 కోట్లతో వైఎస్సార్ ప్రాజెక్ట్ కడితే.. జగన్ ప్రభుత్వం మెయింటెనెన్స్ కు కోటి కూడా ఇవ్వడం లేదని మండిపాటు
  • వైఎస్ కట్టిన ప్రాజెక్ట్ మెయింటెన్స్ కూడా చేయని మీరు వారసుడు ఎలా అవుతారని ప్రశ్న
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రూ. 750 కోట్లు పెట్టి వైఎస్సార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే... ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.  

లక్ష ఎకరాలకు సాగునీరు, 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ గుండ్లకమ్మ అని షర్మిల చెప్పారు. 16 నెలల క్రితం ఒక గేటు, మూడు నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయాయని అన్నారు. మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే గేట్లు కొట్టుకుపోతున్నాయని చెప్పారు. ఐదు సంవత్సరాల నుంచి సరిగా మెయింటెనెన్స్ చేసి ఉంటే గేట్లు కొట్టుకుపోయేవి కాదని చెప్పారు. 

జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్సార్ నిర్మించారని... ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ కూడా చేయని మీరు వైఎస్ వారసుడు ఎలా అవుతారని ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గేట్లు కొట్టుకుపోవడం వల్ల రెండు టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఖాళీ కావడంతో... నీళ్లు లేక ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను నిలబెడుతున్నానని జగనన్న అంటున్నారని... ఇదేనా ఆశయాలను నిలబెట్టడం? అని విమర్శించారు.
YS Sharmila
Congress
Jagan
YSRCP
Gundlakamma

More Telugu News