Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం మళ్లీ దరఖాస్తులు.. ఈసారి మీసేవలో..

  • మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ సూచన
  • ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు
  • ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా మళ్లీ అప్లై చేయాల్సిందే
  • దరఖాస్తుల స్క్రూటినీ కోసం తప్పదంటూ అధికారుల వివరణ
Apply For New Ration Cards on Mee Seva Telangana Govt Order

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు సమర్పించినా సరే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. స్క్రూటినీ కోసం కొత్తగా అప్లై చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు సూచిస్తున్నారు. ఇంతకుముందు అవకాశం ఇవ్వని కేటగిరీకి చెందిన వారు కూడా తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఇందుకోసం ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు విధించిందని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఆరు హామీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజాపాలన పేరుతో ఊరూరా సభలు ఏర్పాటు చేసి అర్హుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అభయహస్తం, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం వైట్ పేపర్ పై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇలా సేకరించిన దరఖాస్తులను ప్రస్తుతం ఆన్ లైన్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని అధికారవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డులకు మీసేవ ద్వారా మరోమారు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి మీసేవ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించింది.

More Telugu News