Layoffs: టెక్ సంస్థల్లో మళ్లీ మొదలైన లేఆఫ్‌ల పర్వం.. మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, స్విగ్గీలలో వందలాదిమంది ఉద్యోగుల తొలగింపు

  • ఎడాపెడా ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ సంస్థలు
  • ఈ ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగులను నిద్రకు దూరం చేస్తున్న వైనం
  • మైక్రోసాఫ్ట్ గేమింగ్ నుంచి 1900 మంది ఔట్
  • టెక్నాలజీ, కాల్ సెంటర్, కార్పొరేట్ విభాగాల్లోని ఉద్యోగులపై స్విగ్గీ వేటు
Tech Industry once again sharpen their layoffs knife

టెక్ రంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. గతేడాదిని లేఆఫ్ సంవత్సరంగా మార్చిన టెక్ సంస్థలు చూస్తుంటే ఈ ఏడాది కూడా దానిని కొనసాగించేలా కనిపిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహా సేల్స్‌ఫోర్స్, లెవిస్ స్ట్రాస్, స్విగ్గీ వంటి సంస్థలు వందలాదిమంది ఉద్యోగులను రోడ్డున పడేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ డివిజన్‌లో 1900 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు ప్రకటించింది. ఆ సంస్థలో మొత్తం 22 వేల మంది ఉద్యోగుల్లో ఇది దాదాపు 8 శాతం. ఇక సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ‘సేల్స్‌ఫోర్స్’ మరోమారు ఉద్యోగుల మెడపై కత్తి వేలాడదీసింది. 700 మందిని తొలగిస్తున్నట్టు తెలిపింది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో గతేడాది 8 వేల మందిని ఇంటికి పంపిన సేల్స్‌ఫోర్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఒకశాతం ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది.

దుస్తుల తయారీ కంపెనీ లెవిస్ స్ట్రాస్ తన వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది. ఇక, దేశీయ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా టెక్నాలజీ, కాల్ సెంటర్, కార్పొరేట్ విభాగాల్లో పనిచేస్తున్న 400 మందిని తొలగించాలని నిర్ణయించింది.

More Telugu News