China: వయ్యారిభామల కోసం వెంపర్లాడితే బలైపోతారు జాగ్రత్త... పౌరులకు చైనా ప్రభుత్వం హెచ్చరికలు

  • హనీ ట్రాప్ లపై ఆందోళన వ్యక్తం చేస్తున్న చైనా ప్రభుత్వం
  • ఓ ఉద్యోగి ఉదంతాన్ని పౌరులకు వివరించిన వైనం
  • అందగత్తె ముసుగులో విదేశీ ఏజెంట్లు వల విసురుతారని వెల్లడి
  • ఒక్కసారి చిక్కుకుంటే అంతే సంగతులని స్పష్టీకరణ 
China warns citizens about honey trap

ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ ట్రాప్. సైనికులను, శాస్త్రవేత్తలను వలలోకి లాగేందుకు అందాలభామల ముసుగులో ముష్కరులు ఈ హనీ ట్రాప్ లు విసురుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. 

వయ్యారిభామల కోసం వెంపర్లాడవద్దని దేశ పౌరులకు హితవు పలికింది. అందాలభరిణెల కోసం ఆరాటపడితే బలైపోయేది మీరే అంటూ హెచ్చరించింది. విదేశీ గూఢచారులు అందగత్తెల ముసుగులో వల విసురుతారని, ఒక్కసారి చిక్కుకుంటే అంతే సంగతులు అని చైనా భద్రతా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సోషల్ మీడియా వేదిక వీ చాట్ లో పోస్టు చేసింది. 

లిసి అనే వ్యక్తి విదేశీ పర్యటనకు వెళ్లి ఓసారి నైట్ క్లబ్ ను సందర్శించాడని, అక్కడ్నించి అతడిని విదేశీ ఏజెంట్లు బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారని సదరు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లిసి చైనా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నాడని, విదేశీ గూఢచారులు అతడిని తియ్యటి మాటలతో వలలోకి లాగి, తమ దేశానికి రప్పించుకున్నారని, అతడిని నైట్ క్లబ్ లో దుస్తులు లేకుండా ఫొటోలు తీశారని వివరించింది. 

తమకు సహకరించకపోతే ఆ ఫొటోలు బహిర్గతం చేస్తామని అతడిని బెదిరించడం ప్రారంభించారని, దాంతో భయపడిపోయిన లిసి ఎంతో కీలక సమాచారం ఉన్న తన ల్యాప్ ట్యాప్ ను వారికి అందించాడని వెల్లడించింది. 

ఆ తర్వాత చైనా వచ్చేసినప్పటికీ లిసి ఆ గూఢచారులకు సమాచారం చేరవేస్తూనే ఉన్నాడని, అతడిపై అనుమానం వచ్చి విచారించడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చిందని చైనా భద్రతా మంత్రిత్వ శాఖ తెలిపింది. అందుకే, అందాల భామల కోసం ఆరాటపడవద్దని, చిక్కుల్లో పడవద్దని తమ దేశ పౌరులకు సూచించింది.

More Telugu News