YS Sharmila: సీఎం జగన్ బీజేపీకి బానిసలా మారిపోయారు: గుంటూరులో షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

YS Sharmila severe comments on CM Jagan
  • గుంటూరులో కాంగ్రెస్ నేతల సమావేశం
  • ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ చీఫ్ షర్మిల
  • రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని వెల్లడి
  • మణిపూర్ లో క్రైస్తవులపై దాడి జరుగుతున్నా జగన్ స్పందించడంలేదని విమర్శలు
గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో నేడు కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఏపీలో మైనారిటీలకు కష్టకాలం నడుస్తోందని, రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. మణిపూర్ లో క్రైస్తవులపై దాడి జరుగుతున్నా ఏపీ సీఎం జగన్ స్పందించలేదని షర్మిల విమర్శించారు. సీఎం జగన్ బీజేపీకి బానిసలా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ, బీజేపీకి వైసీపీ ఊడిగం చేస్తోందని మండిపడ్డారు.

 సొంత పార్టీ  ఎమ్మెల్యేలకే సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని అన్నారు. సీఎం జగన్ పెద్ద పెద్ద గోడలు కట్టుకుని కోట లోపల ఉన్నారని షర్మిల ఘాటు విమర్శలు చేశారు.  

ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? అని షర్మిల నిలదీశారు. ఎన్నికల వేళ జాబ్ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. గుంటూరు నగరం గుంతలూరుగా మారిపోయిందని వ్యంగ్యం ప్రదర్శించారు. జీతాలు ఇచ్చేందుకే డబ్బులు లేవు... అభివృద్ధికి ఎక్కడ్నించి వస్తాయి? అని ఎత్తిపొడిచారు. 

రాష్ట్రంలో ప్రతి గడపకు వస్తానని, వీలైనంత మందిని కలుస్తానని షర్మిల వెల్లడించారు.
YS Sharmila
Jagan
Congress
YSRCP
BJP
Andhra Pradesh

More Telugu News