Tableau: రిపబ్లిక్ డేలో ఆకట్టుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు

  • పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ పోరాట యోధుల థీమ్‌తో తెలంగాణ శకటం
  • డిజిటల్ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, ఫ్యూచర్ స్కిల్స్‌ను వివరించేలా ఏపీ విద్యా శాఖ శకటం
  • ఆకట్టుకున్న ఇస్రో చంద్రయాన్-3, యూపీ రామ్ లల్లా శకటాలు
Tableau of Telangana attracted at 75th Republic Day

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ పోరాట యోధుల థీమ్ శకటంతో తెలంగాణ ప్రభుత్వం, విద్యా శాఖ శకటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకర్షించాయి. పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబంబించేలా తెలంగాణ పోరాట యోధుల థీమ్‌తో దీనిని రూపొందించారు. చాకలి ఐలమ్మ, కొమురం బీమ్ వంటి వారి పోరాటాలను గుర్తు చేసుకునేలా రూపొందించారు. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యాశాఖ శకటం అందరినీ ఆకట్టుకుంది. డిజిటల్ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, ఫ్యూచర్ స్కిల్స్‌ను వివరిస్తూ శకటాన్ని రూపకల్పన చేశారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా ఈ శకటాన్ని తీర్చిదిద్దారు. ఈ శకటంపై తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్ బోర్డులు, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లను విద్యార్థులు వినియోగించే తీరును బొమ్మలుగా రూపొందించారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నట్లు చూపించారు. ఇందుకు సంబంధించి 55 సెకండ్ల థీమ్ సాంగ్‌ను రూపొందించారు. శకటం అతిథుల ముందు నుంచి వెళ్లే సమయంలో ఈ సాంగ్ ప్రదర్శించారు.

ఇస్రో ప్రదర్శించిన శకటంలో చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 మిషన్లు ఆకట్టుకున్నాయి. 500 ఏళ్ల చరిత్ర కలిగిన మహిళలతో నడుపుతున్న ఇమా కెయితల్ మార్కెట్‌ను మణిపూర్ ప్రదర్శించింది. ఉత్తర ప్రదేశ్ శకటంలో రామ్ లల్లా ఉండగా, ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్ర ఆ థీమ్‌తో శకటాన్ని ప్రదర్శించింది.

More Telugu News