bandla ganesh: కేసీఆర్ పేరు చెడగొట్టవద్దంటూ.. కేటీఆర్‌కు బండ్ల గణేశ్ చురకలు

  • తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది.. అనుమానం లేదన్న నిర్మాత
  • వారం రోజులుగా కేటీఆర్ మాటలు చూస్తుంటే బాధేస్తోందన్న గణేశ్ 
  • కేసీఆర్ అంత త్వరగా సీఎం కావాలనుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాలని ఎద్దేవా
  • తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా
  • ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిస్తే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్న
Bandla Ganesh satires on KTR

తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుందని... ఇందులో ఎలాంటి అనుమానం లేదని... కేసీఆర్‌కు అంతలా ముఖ్యమంత్రి కావాలని ఉంటే వేరే రాష్ట్రానికి వెళ్లాలని ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ ఎద్దేవా చేశారు. ఆయన గురువారం ఓ వీడియోను విడుదల చేశారు. కేసీఆర్ పేరు చెడగొట్టవద్దని హితవు పలికారు. ముందు ముందు కాంగ్రెస్ చేసే పనులు చూసి మీరు అసూయపడే పరిస్థితులు ఉంటాయని.. కానీ మీరు ఆగం కావొద్దని... మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు.

గత వారం రోజులుగా కేటీఆర్ మాట్లాడే మాటలు చూస్తుంటే తనకు భయం, బాధ వేస్తున్నాయన్నారు. త్వరలో ప్రభుత్వం పడిపోతుందని... త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే వ్యాఖ్యలు చేస్తున్నారని... ఆయన వ్యాఖ్యలు నిజమే కావొచ్చు... ఎందుకంటే రేపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి... ఆ తర్వాత మహారాష్ట్రలో జరుగుతాయి...  ఇతర రాష్ట్రాలలోనూ జరుగుతాయి... ఆయా చోట్ల కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయవచ్చునని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ఏ రాష్ట్రం నుంచి అయినా సీఎం కావడానికి అర్హత ఉందని... కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఇక్కడ ఆ అవకాశం మాత్రం లేదన్నారు.

రేవంత్ రెడ్డిని కలిస్తే ఎందుకు ఉలిక్కిపడ్డారు?

నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే ఉలిక్కిపడ్డారని విమర్శించారు. వారిపై ఒత్తిడి తెచ్చి మీ స్క్రిప్ట్‌తో ప్రెస్ మీట్ పెట్టించారని ఆరోపించారు. "బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలపై సీఎంను కలవకూడదా? మనది ప్రజాస్వామ్యం కాదా? ఎక్కడకు పోతున్నారు సర్ మీరు... ఎందుకు అంత భయపడుతున్నారు? అంతగా బంధించి బర్రెను కట్టేసినట్లు కట్టేసి.. మీ చెప్పు చేతల్లోనే రాష్ట్ర ప్రజలు ఉండాలనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు. తిరగబడతాం... ఎగబడదాం.. అంటూ కేటీఆర్ మాట్లాడటం ఏమిటన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణను పాలిస్తోందని... రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. నలభై యాభై రోజుల పాలనలోనే ఏదో కొంపలు ఆరిపోయినట్లు రోజూ ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటన్నారు. గూగుల్ పే చేయడం, ప్రెస్ మీట్ పెట్టడం... ఇదేనా సర్? అన్నారు. అసలు మీరు ఎందుకు ఓడిపోయారో సమీక్షించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రాలేదని అంటున్నారని... కానీ బీఆర్ఎస్ మొదటిసారి ఎన్ని సీట్లతో గెలిచిందని చురక అంటించారు. అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుందని... ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.

కేసీఆర్ పేరు చెడగొట్టకండి

ఎందుకు ఓడిపోయామనే విషయాన్ని కేటీఆర్ ఆలోచించాలన్నారు. తిరిగి జనాల అభిమానాన్ని చూరగొనడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. కానీ ఈ ప్రభుత్వాన్ని ఎలా దించాలి? అనే ఆలోచన చేస్తే మాత్రం మీకు వచ్చేదేమీ లేదన్నారు. పైగా కేటీఆర్‌ను ఎక్కడైనా.. కేరళ వైద్యులకు చూపించాలని ప్రజలు అనే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్ అబ్బాయిగా కేటీఆర్‌ను గౌరవిస్తున్నామని... మీరు మీ నాన్నగారి పేరు చెడగొట్టవద్దని సూచించారు. బీఆర్ఎస్ పేరును అప్రతిష్ఠ పాలు చేయకుండా ప్రజాసమస్యలపై పోరాడాలని కేటీఆర్‌కు సూచించారు. క్రమంగా అన్నీ జరుగుతాయన్నారు.

More Telugu News