Revanth Reddy: పులి బయటకు వస్తుందంటున్నారు.. బోను రెడీగా ఉంది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్

CM Revanth Reddy indirect comments on kcr ktr and harish rao
  • చార్లెస్ శోభరాజ్ పడుకుంటే బిల్లా, రంగాలు ఊరూరు తిరుగుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి
  • చార్లెస్ శోభరాజ్‌ను బయటకు రమ్మనండంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్య
  • ఒక్క హామీని నెరవేర్చని బీఆర్ఎస్‌కు మా గ్యారెంటీలపై ప్రశ్నించే హక్కు ఉందా? అని నిలదీత
చార్లెస్ శోభరాజ్ ఇంట్లో పడుకుంటే బిల్లా, రంగాలు ఊరూరు తిరుగుతూ పులి బయటకు వస్తుందని చెబుతున్నారని... కానీ పులి బయటకు వస్తే బోను రెడీగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని మనం చెప్పామని... కానీ బిల్లా, రంగాలు మాత్రం 50 రోజులు గడవకముందే హామీలు అమలు చేశారా? అని ప్రశ్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

ఓ వైపు చార్లెస్ శోభరాజ్ ఇప్పుడు ఇంట్లో పడుకున్నారని... మరోవైపు బిల్లా, రంగాలు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. చార్లెస్ శోభరాజ్‌ను బయటకు రమ్మనండి అంటూ ముఖ్యమంత్రి సవాల్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి దోచుకున్నాం... మిమ్మల్ని అవమానించాం... మమ్మల్ని క్షమించండంటూ వారు తిరుగుతున్నారన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా వారి వైఖరి ఉందన్నారు.

ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్క బోర్లా పడటం వల్లే బయటకు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు... పేదలకు డబుల్ బెడ్రూం ఇవ్వలేదు.. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు.. మైనార్టీలకు 12 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని విమర్శించారు. ఒక్క హామీ నెరవేర్చని బీఆర్ఎస్‌కు మా గ్యారెంటీలపై ప్రశ్నించే అర్హత ఉందా? అన్నారు. మీలా మేం ఉద్యోగులకు వేతనాలు ఆపలేదన్నారు. ఫిబ్రవరి చివరి నాటికి రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలోకి నగదు బదిలీ చేసే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.
Revanth Reddy
Congress
KCR
KTR
Harish Rao

More Telugu News