Team India: తొలిపోరుకు రంగం సిద్ధం.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

  • భారత్‌కు ఫీల్డింగ్ అప్పగించిన బెన్‌‌స్టోక్స్
  • టీమిండియాను ఎదుర్కోవడం సవాలేనని వ్యాఖ్య
  • ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి భారత్
England opt to bat against India in Uppal test match

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఉప్పల్‌లో జరగనున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బజ్‌బాల్ ఆటతో భారత్‌‌కు ముకుతాడు వేస్తామని ప్రకటించిన ఇంగ్లండ్ పోరుకు ముందే టీమిండియాపై పైచేయి సాధించే ప్రయత్నం చేసింది. అయితే, స్వదేశంలో వరుసగా 16 టెస్టు సిరీస్‌లను గెలిచిన భారత్‌‌ను ఇంగ్లండ్ ఎలా అడ్డుకుంటుందన్నది ఆసక్తికరమే. 2012లో భారత్ చివరిసారి సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలోనే ఓడడం కొంత కలవరపాటుకు గురిచేసే అంశమే. 

మరోవైపు, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ పరంగా చూసుకున్నా భారత్‌‌కు ఇది ఎంతో ముఖ్యమైన సిరీస్. రోహిత్‌సేన ప్రస్తుతం 4 టెస్టు సిరీస్‌లలో రెండు విజయాలు, ఓ ఓటమి, ఒక డ్రాతో 54.16 పాయింట్లతో డబ్ల్యూటీసీ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ ఐదు టెస్టుల్లో రెండు సిరీస్‌లలో రెండేసి విజయాలు, ఓటములు, ఒక డ్రాతో ఏడో స్థానంలో ఉంది.

టాస్ అనంతరం రోహిత్‌శర్మ మాట్లాడుతూ.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను తొలిసారి ఆడుతున్నట్టు చెప్పాడు. కుర్రాళ్లందరూ ఉత్సాహంగా ఉన్నారని, ఇలాంటి వాతావరణంలో తాము గతంలోనూ ఆడామని చెప్పుకొచ్చాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.

ఇంగ్లండ్ స్కిప్పర్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. భారత్‌లో కఠిన వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నాడు. తమ ప్రాక్టీస్ బాగుందని, భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్ ఉన్న పరిస్థితుల్లో ఆ జట్టును ఎదుర్కోవడం సవాలేనన్న సంగతి తమకు తెలుసన్నాడు. ఇక్కడికి ఏ జట్టు వచ్చినా ఇలాంటి సవాళ్లే ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. వాళ్లు (భారత్) అద్భుతమైన విజయాలతో దూసుకెళ్తున్నారని ప్రశంసించాడు. తమ జట్టులో ప్రతి ఒక్కరిలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోందని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. 

భారత జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్‌గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. 

ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జోరూట్, జానీ బయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రేహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లీ, మార్క్‌వుడ్, జాక్ లీచ్.

More Telugu News