Konda Vishweshwar Reddy: బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై పోలీస్ కేసు ఎందుకు పెట్టానంటే..: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • బీఆర్ఎస్ సర్పంచ్‌లకు తాను మద్దతు కోసం ఫోన్ చేస్తే బెదిరించాడన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • రాజకీయ మద్దతు కోసం సర్పంచ్‌లకు ఫోన్ చేస్తే తప్పెలా అవుతుందని ప్రశ్న
  • బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ.. అందుకే వారిని బీజేపీలో చేరమన్నానని చెప్పిన బీజేపీ నేత
konda vishweshwar reddy reveals why he was filed case against Ranjith reddy

బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ అని... అందుకే ఆ పార్టీ సర్పంచ్‌లను తమ పార్టీలో చేరమని తాను ఫోన్ చేశానని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై తాను పోలీస్ స్టేషన్‌లో కేసు ఎందుకు పెట్టాననే అంశంపై ఆయన ఎన్టీవీతో మాట్లాడారు. రంజిత్ రెడ్డి తనను దుర్భాషలాడారంటూ విశ్వేశ్వర్ రెడ్డి ఈ నెల 20న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితో ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 17వ తేదీన తనకు రంజిత్ రెడ్డి ఫోన్ చేసి ఇష్టారీతిన మాట్లాడినట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లకు తాను మద్దతు కోసం ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేశావంటూ తనను బెదిరించాడన్నారు. రాజకీయ మద్దతు కోసం సర్పంచ్‌లకు ఫోన్ చేస్తే తప్పెలా అవుతుంది? అని ప్రశ్నించారు. కానీ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో కేసు పెట్టినట్లు చెప్పారు. తన జీవితంలో ఎవరూ తనపై ఇలా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ అని, అందుకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాలని వారికి సూచించినట్లు చెప్పారు. రంజిత్ రెడ్డి ఫోన్‌ను సీజ్ చేసి రికార్డ్స్ పరిశీలించాలని కోరినట్లు తెలిపారు.

More Telugu News