BRS MLAs: సీఎంను ఎందుకు కలిశామంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వివరణ

  • కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారాన్ని కొట్టిపారేసిన సునీతా లక్ష్మారెడ్డి
  • దుష్ప్రచారం ఆపకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • అభివృద్ధి పనుల్లో సహకరించాలని కోరడానికే సీఎంను కలిశామన్న ప్రభాకర్ రెడ్డి
BRS Mlas Press Meet AT Telangana Bhavan

‘మా పార్టీకి, అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉంది, కార్యకర్తలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రచారం’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, పరువునష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. మంగళవారం ముఖ్యమంత్రిని కలవడంతో మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం వివరణ ఇచ్చారు. 

అభివృద్ధి పనుల కోసమే..: సునీతా లక్ష్మారెడ్డి
బుధవారం ఉదయం పార్టీ హెడ్డాఫీసు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు మాట్లాడారు. అభివృద్ధి పనులకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికే వెళ్లామని సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని వివరించారు.  

రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక కాంగ్రెస్ పార్టీకా?..: కొత్త ప్రభాకర్ రెడ్డి
ముఖ్యమంత్రి అనే వ్యక్తి తెలంగాణకా? లేక కాంగ్రెస్ పార్టీకా? అని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు ఓ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి మరో ముఖ్యమంత్రి ఉండరని తాను భావిస్తున్నట్లు వివరించారు. మా నియోజకవర్గంలోని ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిస్తే ఆ పార్టీలో చేరేందుకేనని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తాము ఎందుకు వెళతామని అడిగారు. 2001 నుంచి పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి వెళ్లే ఉద్దేశం తమకు ఎంతమాత్రమూ లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇంకా వందసార్లు కలుస్తాం..: గూడెం మహిపాల్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో మరో వందసార్లు కలుస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. అందులో తప్పేముందని, నియోజకవర్గ ప్రతినిధులుగా ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఉంటుందని వివరించారు. అభివృద్ధి పనుల విషయంలోకానీ, అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలు గురించి కానీ తప్పకుండా కలుస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కడికైనా వెళతామని, ఎవరినైనా కలుస్తామని వివరించారు. ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారతారని ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వీడనని, కేసీఆర్ వెంటే నడుస్తానని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపొద్దని చెప్పా..: మాణిక్ రావు
 తాను పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలో అని, చనిపోయేంత వరకూ పార్టీలోనే కొనసాగుతానని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ, మారే ఆలోచన కానీ తనకు లేవని వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గ ప్రజల కోసం, సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పనులు ఆపొద్దని కోరేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెప్పారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా, వారి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రిని, మంత్రులను కలవాల్సి వస్తుందని వివరించారు. ఇందులో భాగంగానే మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెప్పారు. అంతమాత్రాన పార్టీ మారతారని ప్రచారం చేయడం తగదని మాణిక్ రావు చెప్పారు.

More Telugu News