Jagan: చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.. నాకెవరూ లేరు: జగన్

Chandrababu has star campaigners in other parties says Jagan
  • దత్తపుత్రుడు, వదిన, మీడియా అధిపతులు చంద్రబాబు క్యాంపెయినర్లు అన్న జగన్
  • రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన అభిమానులు కూడా స్టార్ క్యాంపెయినర్లే అని వ్యాఖ్య
  • ప్రతి ఇంట్లోని అక్కాచెల్లెమ్మలే తన స్టార్ క్యాంపెయినర్లు అన్న సీఎం
టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడూ ఒక్క మంచి పని కూడా చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. చెడు మాత్రమే చేసిన చంద్రబాబుకు గజదొంగల ముఠా ఉందని అన్నారు. రామోజీరావు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లకు తోడు దత్త పుత్రుడు ఉన్నారని ఎద్దేవా చేశారు. వీళ్లకు మనం ప్రతిరోజూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని అన్నారు. వైసీపీ పాలనలో ప్రతి ఇంట్లో మేలు జరుగుతున్నా... మీడియా మొత్తం తన వైపే ఉండటంతో ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరానిధుల జమ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు ఏ సంక్షేమం చేయకపోయినా... ఆయనను ఆకాశానికి ఎత్తేసేందుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని జగన్ అన్నారు. పక్క పార్టీల్లో, పక్క రాష్ట్రంలో ఆయనకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని చెప్పారు. దత్తపుత్రుడు (పవన్) ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, ఆయన వదిన (పురందేశ్వరి) మరో స్టార్ క్యాంపెయినర్ అని విమర్శించారు. పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉండే మీడియా అధిపతులు చంద్రబాబుకు క్యాంపెయిన్ చేస్తుంటారని దుయ్యబట్టారు. 

రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన చంద్రబాబు అభిమాని కూడా ఆయన స్టార్ క్యాంపెయినరే అని అన్నారు. పసుపు, కమలాల మనుషులతో పాటు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఆయనకు ఉన్నారని చెప్పారు. వీరిలో కొందరు వేదికలపై కనిపిస్తే, మరికొందరు టీవీల్లో కనిపిస్తారని చెప్పారు. బాబును భుజాన మోసే ముఠాలో చాలా మంది ఉన్నారని అన్నారు. తనకు ఒక్క స్టార్ క్యాంపెయినర్ కూడా లేరని... మన ప్రభుత్వంలో మంచి జరిగిన ప్రతి ఇంటిలోని అక్కాచెల్లెమ్మలే తన స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పారు.
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
AP Politics

More Telugu News