Raghunandan Rao: సీట్లు అమ్ముకుందాం... డబ్బు దండుకుందాం... బీఆర్ఎస్ ఆలోచన ఇదే: బీజేపీ నేత రఘునందన్ రావు

  • తెలంగాణ ఉద్యమకారులను ఏ రోజూ పట్టించుకోలేదన్న రఘునందన్ రావు
  • అధికారం కోల్పోయాక ఉద్యమకారులకు సముచితస్థానం అంటున్నారని విమర్శ
  • బీఆర్ఎస్ పార్టీలో వందల కోట్ల రూపాయలు సంపాదించిన వారికే టిక్కెట్లు దక్కుతాయని ఆరోపణ
  • పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటూ రాదని జోస్యం
Raghunandan Rao fires at BRS leaders for comments on BJP

సీట్లు అమ్ముకుందాం... డబ్బు దండుకుందామనే ఆలోచన తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏనాడూ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏ రోజూ పట్టించుకోలేదన్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పేరు ప్రచారం చేసి ఉద్యమకారులకు అన్యాయం చేశారని మండిపడ్డారు.

హరీశ్ రావు లేదా కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్‌లో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటారా? అని ఆయన నిలదీశారు. ఇప్పుడు అమరవీరులు గుర్తుకువచ్చారా?... అధికారం కోల్పోయాక సముచితస్థానం ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయనందుకు తప్పయిందని లెంపలు వేసుకోవడానికి తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వస్తారా? అమరవీరుల స్థూపం వద్దకు వస్తారా? అన్నది చెప్పాలన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో వందల కోట్ల రూపాయలు సంపాదించిన వారికే టిక్కెట్లు దక్కుతాయని ఆరోపించారు. సీట్లు అమ్ముకుందాం... డబ్బు దండుకుందాం... అనేదే బీఆర్ఎస్ ఆలోచన అన్నారు. బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఖతం చేసేందుకు తమకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావని... అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఖతం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారని... దీంతో మిమ్మల్ని ఇంటికి పంపించారన్నారు.

రేపు పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. మీరు పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైనా మీకోసం ఎవరూ తలుపు తీయరన్నారు. బీజేపీ అయితే పొరపాటున కూడా మిమ్మల్ని దగ్గరకు రానీయదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంపీ సీట్లను బేరానికి పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీపై బీఆర్ఎస్ నేతలు అవాకులు.. చవాకులు పేలితే ఊరుకునేది లేదన్నారు.

More Telugu News